Tuesday, November 26, 2024

Delhi | బీఆర్ఎస్ వైపు దేశం చూపు.. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చేరికలు: ఎంపీ నామా

న్యూఢిల్లీ (ఆంధ్రప్రభ): దేశంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విస్తరిస్తోందని, రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ ప్రత్యర్థి పార్టీలకు ముచ్చమటలు పట్టిస్తోందని పార్టీ లోక్ సభా పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మీడియాతో పలు విషయాలు వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లో బీఆర్ ఎస్ పార్టీకి అమితమైన ఆదరణ లభిస్తోందన్నారు. మహారాష్ట్రలో కేసీఆర్ అభివృద్ధికి ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలోకి వస్తున్నారని నామా అన్నారు. కేసీఆర్ అభివృద్ధి మోడల్ ను దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్  అంటూ కేసీఆర్ ఇచ్చిన నినాదం అద్భుతాలు సృష్టిస్తుందని అన్నారు.

అన్ని వర్గాల నుంచి బీఆర్​ఎస్​ పార్టీకి అనూహ్య స్పందన లభిస్తోందని నామా తెలిపారు. ముఖ్యంగా రైతుల నుంచి బ్రహ్మాండమైన స్పందన ఉండడం వల్ల మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో రైతులు బీఆర్ఎస్ లోకి వస్తున్నారని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న  రైతు బంధు , రైతు భీమా, 24 గంటల ఉచిత కరెంట్, సాగు, తాగు నీటి వంటి రైతు పథకాలపై మహారాష్ట్ర రైతులు మక్కువ చూపిస్తూ, అధిక సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పారు. అతి త్వరలోనే మహారాష్ట్ర , ఏపీ, ఒడిశా, తదితర రాష్ట్రాల్లో  బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయని నామా చెప్పారు. అన్ని రాష్ట్రాల్లోని పార్టీ కార్యాలయాలు న్యూఢిల్లీ,  హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయాలతో అనుసంధిస్తారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement