హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఫార్మాసిస్టు పోస్టులకు వైద్యారోగ్యశాఖలో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 105 పోస్టులకు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. 310 ఫార్మిసిస్టు పోస్టుల భర్తీకి గాని ఈ కౌన్సలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. టీవీవీపీ పరిధిలోని 135 పోస్టులకు, డీఎంఈ పరిధిలోని 70 పోస్టులకు శుక్రవారం కౌన్సెలింగ్ జరుగనుంది.
వీరికి త్వరలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చేతులమీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 369 ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి 2018 జనవరి 25న టీఎస్‌పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో డీపీహెచ్ పరిధిలో 125, డీఎంఈ 96, టీవీవీపీలో 148 పోస్టులు ఉన్నాయి. అయితే, కోర్టు కేసుల కారణంగా ఫలితాల వెల్లడిలో జాప్యం చోటుచేసుకుంది.
ఇందులో 310 పోస్టుల భర్తీకి న్యాయస్థానం తాజాగా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ ఈ నెల 12న 310 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో డీపీహెచ్ పరిధిలో 105, డీఎంఈ పరిధిలో 70, టీవీవీపీ పరిధిలో 135 పోస్టులు ఉన్నాయి. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి కోరుకున్న చోట పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఫార్మాసిస్టులుగా నియమితులవుతున్న వారికి మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు.