తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. బాలాయపల్లి మండలం కడగుంట గ్రామంలో ఐదేళ్ల బాలికపై తొమ్మిదో తరగతి విద్యార్థి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వడమాలపేట ఏఎం పురం ఘటన మరువక ముందే జిల్లాలో మరో బాలికపై లైంగికదాడి బయటపడింది.
స్థానికుల సమాచారం మేరకు బాలాయపల్లి మండలం కడగుంట గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వారం రోజుల క్రితం చిన్నారికి తినుబండారాలు ఆశ చూపించి అదే గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. చిన్నారి గట్టిగా కేకలు పెట్టడంతో నానమ్మతో పాటు బంధువులు రావడంతో కామాంధుడు నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
కేసు నమోదు చేయని పోలీసులు
బాలికపై జరిగిన అత్యాచారంపై కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు కేసు నమోదు చేయలేదు. బాలిక తల్లిదండ్రులు వెనుకబడిన వర్గాలకు చెందిన వారు కావడంతో రాజీ చేసుకోవాలని సూచించారు. వారే పెద్ద మనుషులను, బాలుడి తండ్రిని పిలిపించి పోలీస్ స్టేషన్‌లోనే పంచాయతీ పెట్టారు. పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న ఓ సర్పంచ్, నలుగురు నాయకులు రంగంలోకి దిగారు. విషయం బయటకు రాకుండా కప్పి పుచ్చేందుకు పోలీస్ స్టేషన్‌లోనే బేరసారాలు మొదలుపెట్టారు. గంటల కొద్ది బాధితులను, నిందితులను స్టేషన్‌లో కూర్చోబెట్టి రాజీ చేశారు.
ఎట్టకేలకు బయటపడిన నిజం
దాదాపు ఒక రోజంతా స్టేషన్‌లో పెద్దమనుషులు రాజీయత్నం చేశారు. చివరకు బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించారు. బాలికపై జరిగిన అత్యాచారానికి బాలుడి తండ్రి సుమారు రూ.30 వేలు పరిహారంగా చెల్లించాలని పెద్దమనుషులు తీర్పు విషయాన్ని బయటకురాకుండా సర్దుబాటు చేశారు. అయితే నిజం నిప్పులాంటిది. ఎక్కువ రోజులు దాగదు. వడమాలపేటలో బాలిక హత్య నేపథ్యంలో బాలాయపల్లి మండలం కడగుంట ఘటన వారం రోజులు తర్వాత బట్టబయలైంది.
బెదిరించి, భయపెట్టి
తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే అండగా నిలవాల్సిన పోలీసులు కేసు నమోదు చేయలేదు. అప్పటికే రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బలహీనవర్గాలకు చెందిన వారికి ఎవరు అండగా ఉంటారంటూ బాధితులను పెద్దమనుషులు బెదిరించారు. అంతేకాదుH తాము చెప్పినంతా తీసుకుని నోరు మెదపొద్దని హుకుం జారీ చేశారు. విషయం బయటపెడితే అంతు చూస్తామని, ఎవరు అడ్డుస్తారో చూస్తామంటూ భయపెట్టారు. దీంతో బాధిత కుటుంబం సైలెంట్ అయిపోయింది.
ఖాకీల కాఠిన్యం
న్యాయం కోసం వచ్చిన బాధితులతో పోలీసులు అనుచితంగానే ప్రవర్తించారు. కేసు నమోదు చేయకుండా నిందితుల తరుఫున వకల్తా పుచ్చుకున్నారు. విషయం బయటకు రాకుండా పెద్దమనుషులను రప్పించి రాజీయత్నం చేశారు. తమ కళ్లముందే పెద్దమనుషులు బాధితులను బెదిరిస్తుంటే అడ్డుకోకుండా చూస్తూ ఉండిపోయారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు బాధితులపైనే కేసు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో బాధితులు నష్టపరిహారం తీసుకోవడానికి అంగీకరించాల్సి వచ్చింది.
పోలీస్ శాఖకే మచ్చ
ఎస్పీ సుబ్బరాయుడు జిల్లాలో అవినీతి పోలీస్ అధికారుల భరతం పడుతున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నారు. అయినా కొంత మంది పోలీసుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా బాలికపై అత్యాచారం కేసులోను పోలీసులు నడుచుకున్న తీరు ఆ శాఖకే మచ్చతెచ్చేలా ఉందనే అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది. నిజానిజాలను బయటపెట్టాల్సిన పోలీసులు పెద్దమనుషులతో రాజీ చేయించడం, బాధితులను భయబ్రాంతులకు గురిచేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఐసీడీఎస్‌కు సమాచారం లేదా?
బాలికలుపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్థానిక ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందుతూ ఉంటుంది. ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ, ఆయాలకు స్థానిక సమాచారం ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. అయితే ఈ ఘటన జరిగి వారం అవుతున్నా ఐసీడీఎస్ అధికారులకు విషయం తెలియకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నేతలకు భయపడో, వారి ఆదేశాల మేరకు విషయం బయటకు రాకుండా చూశారా అనే ప్రశ్నలు ఉత్సన్నవుతున్నాయి.