Friday, November 22, 2024

అవినీతి కట్టలు.. సమాజ్‌వాదీ పార్టీ నేత ఇంట్లో సోదాలు.. ఏక కాలంలో 50 చోట్ల తనిఖీలు

న్యూఢిల్లీ : ఉత్తర్‌ప్రదేశ్‌లో అవినీతి కంపు బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. అత్తరు వ్యాపారం కోట్ల వర్షం కురిపిస్తోంది. దర్యాప్తు సంస్థల సోదాల్లో వందల నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న ఈ రాష్ట్రంలో జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌, ఐటీ వంటి సంస్థల దాడులు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కన్నౌజ్‌లో మరో అత్తరు వ్యాపారి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. సదరు వ్యాపారి పేరు పుష్పరాజ్‌ జైన్‌. సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఆయన ఎమ్మల్సీగా కూడా ఉన్నారు. ఆయన 2022 కోసం 22 పువులతో తయారు చేసిన సమాజ్‌వాదీ అత్తరు విడుదల చేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు శుక్రవారం రాత్రి వరకు కూడా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. పుష్పరాజ్‌.. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు. పార్టీకి పెద్ద ఫైనాన్షియర్‌గా చెబుతారు. పీయూష్‌ జైన్‌పై ఐటీ తరువాత జరుగుతున్న ఈ దాడి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పుష్పరాజ్‌ జైన్‌ ఇల్లు కూడా పీయూష్‌ జైన్‌ ఇంటికి కొద్ది దూరంలోనే ఉంది. ఈయన నిత్యం మీడియాతో మాట్లాడుతూ ఉండేవాడు.

12 దేశాల్లో పుష్పరాజ్‌ వ్యాపారం
పుష్పరాజ్‌ జౖౖెన్‌ 2016లో ఇటావా-ఫరూఖాబాద్‌ నుంచి ఎస్పీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అతను ప్రగతి ఆరోమా ఆయిల్‌ డిస్టిల్లర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సహా యజమాని. అతని తండ్రి సవైలాల్‌ జైన్‌ 1950లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. పుష్పరాజ్‌.. అత్తరు వ్యాపారం చేస్తుంటాడు. 12 కంటే ఎక్కువ దేశాల్లో ఇతని వ్యాపారం విస్తరించి ఉంది. 2016 ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం.. పుష్పరాజ్‌ అతని కుటుంబానికి రూ.37.15కోట్ల విలువైన చరాస్తులు, రూ.10.10 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదు. కన్నౌజ్‌ కళాశాలలో 12వ తరగతి వరకు మాత్రమే చదివాడు.

రహస్య స్థావరాలపై..
కన్నజ్‌లోని మరో అత్తరు వ్యాపారి మాలిక్‌ మియాన్‌ ఆవరణలో కూడా దాడులు కొనసాగుతున్నాయి. గతంలో కూడా పుష్పరాజ్‌ రహస్య స్థావరాలపై ఐటీ శాఖ దాడులు చేసేందుకు సిద్ధమైంది. అప్పుడు రహస్య సంకేతంగా పీ కోసం బృందం వేట ప్రారంభించింది. ఈ క్రమంలో ఐటీ బృందం అనుకోకుండా.. పీ అంటే పుష్పరాజ్‌ బదులు పీ అంటే పీయూష్‌ జైన్‌ ఇంటికి చేరుకుంది. శుక్రవారం ఉదయం నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 50 చోట్ల ఏకకాలంలో ఐటీ దాడులు ప్రారంభించారు. కన్నజ్‌తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. యూపీ అసెంబ్లిd ఎన్నికల వేళ ఈ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. 23న పీయూష్‌ నివాసాలపై దాడులు జరిగాయి. దీని తరువాత ఎస్‌పీ అత్తరు తయారు చేసిన పుష్పరాజ్‌ జైన్‌ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. 8 రోజుల తరువాత పుష్పరాజ్‌ జైన్‌ ఇంట్లో జరిగిన దాడిలో ప్రత్యేకంగా ఏమీ లభించలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వారం రోజుల సమయంలో పుష్పరాజ్‌ మొత్తం పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నట్టు సమాచారం.

ఐటీ శాఖ పొరపాటు..!
సోదాలు జరిపిన జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు నిజంగానే పొరపాటున పీయూష్‌ జైన్‌ను టార్గెట్‌ చేశారా..? వారి అసలైన టార్గెట్‌ ఎవరు..? అనే సందేహాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు దీనిపై వివరణ ఇస్తూ.. అసలు యూపీలో ఎవరూ తమ టార్గెట్‌ కాదని.. గుజరాత్‌ అహ్మదాబాద్‌ సమీపంలో ఓ ట్రక్కును పట్టుకుని తీగ లాగితే కాన్పూర్‌లో డొంక కదిలిందని చెబుతున్నారు. ట్రక్కు డ్రైవర్‌ సరైన జీఎస్‌టీ ఇన్‌వాయిలు చూపకపోవడంతో తాము ట్రాన్స్‌పోర్టు సంస్థ గణపతి రోడ్‌ క్యారియర్స్‌, అందులో సరకు రవాణా చేస్తున్న శిఖర్‌ గ్రూప్‌ వివరాలు బయటికొచ్చాయన్నారు. ఈ గ్రూప్‌ లావాదేవీలు పరిశీలిస్తుంటే.. వారు తయారు చేసే పాన్‌ మసాలా, గుట్కాలకు వివిధ సువాసనల ఫ్లేవర్లను సరఫరా చేసే ఓడోకెమ్‌ ఇండస్ట్రీ అధినేత పీయూష్‌ జైన్‌ వ్యవహారం బయటికొచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement