లిమా (పెరూ) : ఆయన దేశాధ్యక్షుడి ముఖ్య భద్రతాధికారి. అధ్యక్షుడిని నిత్యం వెన్నంటి ఉంటాడు. సకల సౌకర్యాలు, సామాన్యుడు ఊహించలేని జీతం, కనుసైగతో ఆదేశాలు పాటించే యంత్రాంగం ఉంటుంది. చక్కగా విధులు నిర్వహించాల్సిన ఆయనకీ అవినీతి జాఢ్యం సోకింది. పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. అంతేనా… ఆ సొమ్మును ఎకాఎకిన అధ్యక్షుడి భవనంలోనే దాచాడు. అక్కడైతే ఎవరూ పట్టుకోలేరని భావించి ఉంటాడు. అయితే ఆ అధ్యక్షుడు సామాన్య జనం నుంచి వచ్చిన అసమాన్యుడు. పైగా ఉపాధ్యాయునిగా పనిచేసి వచ్చిన నిఖార్సయిన నిజాయితీపరుడు. తన అధికారి అవినీతిని గ్రహించాడు. వెంటనే ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించి మరో అధికారిని పెట్టుకున్నాడు. దర్యాప్తునకు ఆదేశించారు.
రంగంలోకి దిగిన నిఘా సంస్థ అధికారులు ఆ మాజీ భద్రతాధికారి పనిచేసిన అధ్యక్షుడి కార్యాలయంలో తనిఖీ చేసి నివ్వెరపోయారు. అధ్యక్షుడికీ మతిపోయినంత పనయింది. కారణం… ఆ అవినీతి అధికారి ఏకంగా అధ్యక్ష భవనంలోనే ఒక స్నానాల గది గోడలో నోట్ల కట్టలను పేర్చేశాడు. భారీఎత్తున అవినీతికి పాల్పడిన ముఖ్య భద్రతాధికారి చివరకు ఊచలు లెక్కపెడుతున్నాడు. ఇదంతా పెరూ దేశంలో జరిగింది. తన స్నేహితులకు పన్ను ఎగవేతలో సాయపడుతూ ఆదాయ, అమ్మకం పన్ను శాఖలపై ఒత్తిడి చేసేవాడు. అయితే దేశాధ్యక్షునిగా ఇటీవలే టీచర్ గా పనిచేసి ఎన్నికైన క్యాస్టిలో ప్రక్షాళనను తన అధ్యక్ష భవనం నుంచే ప్రారంభించడంతో ఆ అవినీతి చక్రవర్తి భండారం బయటపడింది…
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital