ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన కేబినెట్ మంత్రులకు కీలక ఆదేశాలు జారీచేశారు. మంత్రులు, వారి కుటుంబ సభ్యులు మూడు నెలల్లోగా ఆస్తుల వివరాలు ప్రకటించాలని అల్టిమేటం ఇచ్చారు. అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఆస్తుల వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో ఉంచాలని కోరారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో మంత్రుల కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవద్దని మరోసారి హెచ్చరించారు. అవినీతిని పూర్తిగా రూపుమాపాలని, ఆ మాటే వినిపించకూడదని స్పష్టంచేశారు. ఈ మేరకు మంగళవారం కేబినెట్ సమావేశంలో సీఎం పలుకీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ప్రజా ప్రతినిధుల ప్రవర్తన చాలా ముఖ్యం. ఈ స్ఫూర్తి ప్రకారం గౌరవప్రదమైన మంత్రులందరూ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మూడు నెలల వ్యవధిలో ఆస్తుల వివరాలు బహిర్గతం చేయాలి అని ఆదిత్యనాథ్ అన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో కుటుంబ సభ్యులు ప్రమేయం లేకుండా చూసుకోవాలని, తద్వారా ఆదర్శవంతంగా నిలవాలని చెప్పారు.
ఆరు నెలలపాటు అన్ని శాఖల ప్రజెంటేషన్, ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపొందిం చామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఇది అమలు చేయాలని మంత్రులకు సూచించారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టులు పూర్తవ్వాలని చెప్పారు. ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో మనమంతా అంత్యోదయ తీర్మానాన్ని నెరవేర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు, జిల్లా వ్యాప్తంగా స్థానిక నేతలు, ప్రముఖులతో సమావేశాలు నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఒక్కో కేబినెట్ మంత్రి నేతృత్వంలో 18 బృందాలను సీఎం ఏర్పాటు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..