న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రజల కలల ప్రాజెక్ట్ అని చెబుతూ కాళేశ్వరంలో హద్దులు దాటి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ విమర్శించారు. న్యూఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు తీవ్రస్థాయిలో స్పందించారు. అవసరమైన అనుమతులేవీ తీసుకోకుండానే ప్రాజెక్టును నిర్మించారని గజేంద్రసింగ్ ఆరోపించారు.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్ట్ మూడు పంపు హౌజులు మునిగిపోయాయని ఆయన చెప్పుకొచ్చారు. అసలా పంపులను సమకూర్చే సంస్థకే సాంకేతిక సామర్థ్యం లేదని ఆరోపించారు. ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కూడా సరైన పద్దతిలో చేయలేదని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ఆ మోటార్ల మరమ్మతుల పేరుతో మళ్లీ అవినీతికి పాల్పడే ఆస్కారముందని అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడే వేల కోట్ల అవినీతి జరిగిందని గజేంద్రసింగ్ మండిపడ్డారు.