Monday, November 25, 2024

మామూళ్ల మత్తులో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు.. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం..

తెలంగాణలో ఔషధ నియంత్రణ చట్టాల అమలులో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంటోందన్న విమర్శలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. మామూళ్ల మత్తులో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు జోగుతుండడంతో క్వాలిఫైడ్‌ ఫార్మాసిస్టులు లేకుండానే రాష్ట్రంలో వేలాది మెడికల్‌ షాపులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో మెడికల్‌ షాపుల అక్రమ దందాను ఇండియన్‌ ఫార్మాసిస్ట్‌ అసోసియేషన్‌ ఎత్తి చూపించినప్పటికీ రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ ఎలాంటీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అనర్హుల ద్వారా మెడికల్‌ షాపులను నిర్వహిస్తుండడంతో ప్రజలకు నాణ్యమైన ఔషధాలు పొందడమనేది దశాబ్దాలుగా అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. నిబంధనల ప్రకారం ప్రతి మెడికల్‌ షాపులో ప్రజలకు కనిపించేలా డ్రగ్‌ లైసెన్స్‌ ఉంచాలి. అయితే అలాంటి నిబంధనలు అమలు చేయడం రాష్ట్రంలోని మెడికల్‌ షాపుల యాజమాన్యాలు ఎప్పుడో మరిచిపోయాయి.

దీంతో ఔషధాల కోసం వెళ్లే వినియోగదారులకు ఫార్మాసిస్టులు ఎవరు… సహాయకులు ఎవరో తెలియకుండా పోతోంది. ఫార్మసీ కౌన్సిల్‌ యాక్టు ప్రకారం మందులను కచ్చితంగా రిజిస్టర్డ్‌ ప్రాక్టిషనర్‌ మాత్రమే రాయాలి. వాటిని రిజిస్టర్డ్‌ ఫార్మాసిస్టు మాత్రమే పంపిణీ చేయాలి. అలా కాకుండా అనర్హులు మందులను పంపిణీ చేస్తే ఆరు నెలల జైలుశిక్షతోపాటు రూ.1000 జరిమానా విధించాలని చట్టం చెబుతోంది. పలు మెడికల్‌ షాపుల యాజమాన్యాలు అర్హులైన ఫార్మాసిస్టులకు బదులుగా అరకొర జీతానికి వచ్చే అనర్హులతోనే షాపులు నిర్వహిస్తుండడం సాధారణమై పోయింది. దీంతో ఫార్మాసీ విద్యనభ్యసించిన నిరుద్యోగులు… పెద్ద పెద్ద ఫార్మా కంపెనీల్లో చిరు ఉద్యోగులుగా మిగిలిపోతున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 35వేల వరకు మెడికల్‌ షాపులు ఉండ‌గా వీటిని నియంత్రించాల్సిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు 70మంది మాత్రమే ఉన్నారు. ప్రతి 100 మెడికల్‌ షాపులను తనిఖీ చేసేందుకు ఒక డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉండాలని చట్టాలు చెబుతున్నా… అరకొర సిబ్బందితోనే ఔషధ నియంత్రణ శాఖ కాలం వెల్లబుచ్చుతోంది. నిబంధనల ప్రకారం అయితే రాష్ట్రంలో 350 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండాలి. రాష్ట్రంలో 550 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ప్రతి 25 కంపెనీలకు ఒక డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ చొప్పున 25మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండాలి. అంటే మొత్తం 375 డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు రాష్ట్రంలో ఉండాలి. అయితే 70మంది మాత్రమే ఉండడం, వారిలోనూ 80శాతం మంది అవినీతికి పాల్పడుతుండడంతో మెడికల్‌ షాపుల అక్రమ దందా అడ్డూఅదుపు లేకుండా కొనసాగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement