సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వీలైనంత త్వరగా ధరణి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇవ్వాల (శనివారం) సచివాలయంలో ధరణి కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ధరణ కమిటీ కీలక వివరాలను వెల్లడించింది. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖకు ఆదేశాలు జారీచేశారు రేవంత్ రెడ్డి.
రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయి. భూముల రికార్డులపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు చెక్ పెట్టడంతో పాటు కొత్త సమస్యలు రాకుండా ఉండాలని సీఎం కమిటీ సభ్యులను అప్రమత్తం చేశారు. మొదటి విడతగా వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేం మార్గాలున్నాయని ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని, మార్చి మొదటి వారంలోనే అందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు.
కాగా, ఈ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డీ తో పాటు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు ఎం. కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ బి.మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శేషాద్రి, సీసీఎల్ఏ అధికారి లచ్చిరెడ్డి, ఉన్నతాధికారులు సమావేశంలో ఉన్నారు.