హైదరాబాద్, ఆంధ్రప్రభ: నష్టాల బాటలో ఉన్న టీఎస్‌ఆర్టీసీని గట్టెక్కించేందుకు సంస్థ యాజమాన్యం కొత్త పథకాలకు రూపకల్పన చేస్తోంది. ఆక్యుపెన్సీ రేట్ (ఓఆర్)ను 75 శాతానికి చేర్చేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికులకు సీజన్‌ను బట్టి రాయితీలు, డిస్కౌంట్‌లను ప్రకటిస్తూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదాయాన్ని రాబడుతున్నది. అయినప్పటికీ రోజురోజుకూ పెరుగుతున్న నిర్వహణా వ్యయానికి వస్తున్న ఆదాయానికి భారీ వ్యత్యాసం ఉంటున్నది. ఇటీవలి వరకు ఆర్టీసీ ఆదాయం రోజుకు రూ.14 కోట్లు ఉండగా, తాజాగా అది రూ.11 కోట్లకు పడిపోయింది. వీలైనంత మేర సీట్లు నిండేలా చూడండి అంటూ డిపో అధికారులు గేట్ మీటింగ్‌లు పెట్టి కండక్టర్లకు చెప్పే వారు. అయినప్పటికీ ఆర్టీసీకి ఆశించిన మేర ఆదాయం సమకూరడం లేదు. బస్సులు ప్రయాణికులతో కళకళలాడాలంటే వారిని ఆకట్టుకునేలా కండక్టర్ల పాత్ర ఉండాలని ఆర్టీసీ నిర్ణయానికి వచ్చింది.
దీంతో తాజాగా కండక్టర్లకు కూడా కార్పొరేట్ తరహా శిక్షణ ఇప్పించాలని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. శుక్రవారం నుంచి ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణాంశాలను రూపొందించిన ఆర్టీసీ, ప్రత్యేక తరగతులు తీసుకునేందుకు కొందరు బ్యాంక్, ఎల్‌ఐసి మేనేజర్లను గుర్తించింది. ఇందుకు గాను ఒక్కో అధికారికి ఒక్కో క్లాసుకు రూ.500 చెల్లించాలని నిర్ణయించింది. ఖాతాదారులు, వినియోగదారులను ఆకట్టుకోవాలంటే బ్యాంకులు, ఎల్‌ఐసీ సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు? ప్రయాణికులకు తమ వైపుకు ఏ విధంగా తిప్పుకోవాలి? అనే కోణంలో ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ప్రయాణికులు ఆర్టీసీకి సంబంధించి ఇతర వివరాలు అడిగినా, తదుపరి గమ్యస్థానానికి ఏ బస్సెక్కాలి? ఎక్కడ దిగాలి? బస్‌పాస్‌లు, ఒకరోజు పాస్ రూ.100తో ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలు వంటి సమాచారం ఇస్తారు. ఒకవేళ ప్రయాణికులు అడిగిన వివరాల గురించి సంబంధిత కండక్టర్లకు సమాచారం తెలియనప్పుడు ఎవరితో మాట్లాడితే ఈ సమాచారం తెలుస్తుందో వారి ఫోన్ నంబర్లు ఇస్తారు.
ఇంకా అవసరమైతే ప్రయాణికుడి ఫోన్ నంబర్ తీసుకుని ఆ తరువాత సమాచారం ఇవ్వాలి. కాగా, ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీలో మొత్తం 14,000 మంది కండక్టర్లు ఉన్నారు. వీరిలో అధిక శాతం రోటీన్‌గా విధులు నిర్వహిస్తున్నారనే భావనలో ఆర్టీసీ యాజమాన్యం ఉంది. కేవలం మొక్కుబడిగా విధులు నిర్వహించడమే కాకుండా సంస్థ ఆర్థిక పురోభివృద్ధిలో కూడా భాగస్వాములు అయ్యే విధంగా వారిలో మానసిక భావన వచ్చేలా శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి. సంస్థలో ఆక్యుపెన్సీ రేటు (ఓఆర్) 59శాతంగా మాత్రమే నమోదవుతుంది. సంస్థ యాజమాన్యం ఆశిస్తున్న విధంగా ఓఆర్ 75 శాతానికి చేరితే ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కే అవకాశాలు ఉంటాయి. కండక్టర్లకు వారు పనిచేసే డిపోల్లోనే ప్రతి రోజు 30 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణలో భాగంగా ఎంపిక చేసిన ఎల్‌ఐసీ, బ్యాంక్ మేనేజర్లు, ప్రయాణికులను సర్/మేడమ్ అని సంభోదించాలనీ దీంతో వారికి సంస్థ సిబ్బందిపై ఆప్యాయత కలుగుతుందనీ, అప్పుడు వారు చెప్పే విషయాలపై దృష్టి సారిస్తారని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది.
ప్రయాణికులను ఈ విధంగా సంభోదిస్తూ ప్రైవేటు వాహనాలతో పోలిస్తే ఆర్టీసీ బస్సులు ఎలా సురక్షితం? పెరిగిన ఇంధన ధరలతో వ్యక్తిగత వాహనాలపై ప్రయాణించే వారికి ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తే ఎంత వరకు డబ్బు ఆదా అవుతుంది? అనే అంశాలను కండక్టర్లు ప్రయాణికులకు వివరిస్తారు. తద్వారా ఆక్యుపెన్సీ రేటు పెరిగి సంస్థకు ఆశించిన మేర ఆదాయం సమకూరుతుంది. కాగా, కండక్టర్లకు ఈ శిక్షణ ఎప్పటి వరకు ఇవ్వాలనే నిర్దిష్ట గడువు ఏదీ లేదనీ, ఆయా డిపోలలో ఉన్న కండక్టర్లకు శిక్షణ పూర్తయ్యే వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుందని టీఎస్ ఆర్టీసీ ఐటీ విభాగానికి చెందిన ఉన్నతాధికారి యుగంధర్ వెల్లడించారు. ఈ శిక్షణ ద్వారా కండక్టర్లలో విధుల నిర్వహణ పట్ల అంకిత భావం పెరిగి సంస్థ ఆర్థిక పురోభివృద్ధికి దోహదం కలుగుతుందన్న ఐటీ అధికారి యుగంధర్ ఆశాభావం వ్యక్తం చేశారు.