అమరావతి,ఆంధ్రప్రభ: పదో తరగతి పరీక్షలు ఇంకా ప్రారంభం కాకమునుపే ఇంటర్మీడియట్‌లోకి విద్యార్ధులను చేర్చుకునేందకు కార్పొరేట్ కాలేజీలు విద్యార్ధుల వేటను ప్రారంభించాయి. వివిధ పాఠశాల ల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్ధుల వివరాలు సేకరించి ఫోన్లు చేస్తున్నారు. మా కాలేజీలో చేరండి మంచి కోచింగ్ ఇస్తామంటూ ఊరిస్తున్నారు. జెఇఇ, నీట్ కోచింగ్ పట్ల ఆసక్తి ఉన్న విద్యార్ధుల తల్లితండ్రులను ఆకర్షిస్తున్నారు. జెఇఇ, నీట్‌లో కోచింగ్ ఇస్తున్న ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు ఇప్పటి నుండే అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించాయి. పోటీలో ముందు నిలబడాలనే తలంపుతో విద్యార్ధుల తల్లితండ్రులు కూడా ఇప్పటి నుండే కాలేజీల చుట్టూ తిరగడం ప్రారంభించారు. ఆ కాలేజీలో ఎంతెంత ఫీజులున్నాయనే విషయమై ఆరా తీస్తున్నారు. ముందుగా పది వేలు అడ్వాన్స్ కట్టి సీటు రిజర్వ్ చేసుకొమ్మని కార్పొరేట్ యజమాన్యాలు చెబుతున్నాయి. విద్యార్దులకు పరీక్ష కూడా ఆ మార్కుల ఆధారంగా ఫీజులు ఎంతెంత అనేది చేప్పేస్తున్నాయి.
ఈ ఏడాది అదనం గా 20 శాతం ఫీజుల పెంపు..
ఇంటర్‌తోపాటు జెఇఇ/నీట్ కోచింగ్ కోసం వసూలు చేస్తున్న ఫీజు గత ఏడాది కంటే 20 శాతం అదనంగా ఈ ఏడాది నిర్టయించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు గల కార్పొరేట్ కాలేజీ సం స్థలు తమ సంస్థల్లో ఇంటర్ ప్లస్ కోచింగ్ కలిపి ఏడాదికి ఒకటిన్నర నుండి రెండు లక్షల రూపాయల ఫీజును అడుగుతున్నాయి. అదే ఇక హాస్టల్లో జాయిన్ అయితే ఒకటి నుండి రెండు లక్షల రూపాయల అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో పేరుమోసిన కార్పొరేట్ విద్యా సంస్థలు ఏడాదికి ఫీజుల నాలుగు లక్షలుగా వసూలు చేస్తున్నాయి. విద్యార్ధులకు పరీక్ష పెట్టి అందులో మంచి మార్కులొస్తే 30 నుండి 50 వేలు మాత్రం ఈ జాతీయ స్తాయి సంస్థలు తగ్గిస్తున్నాయి. మొత్తంగా చూస్తే కార్పొరేట్ కాలేజీలు ఈ ఏడాది 20 శాతం అదనంగా ఫీజులు పెంచాయి. అయితే లక్షల క్షలు ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వానికి మాత్రం ఇంటర్ కోసం 20 వేల రూపాయల మాత్రమే వసూలు చేసినట్లు చూపిస్తున్నాయి. మిగిలిన ఫీజులన్ని కోచింగ్ ఫీజు తదతర పేర్లతో వసూలు చేస్తున్నాయి.