Friday, November 22, 2024

కార్పొరేట్ విద్యా సంస్థ‌ల అడ్డ‌దారులు – ఆశ‌ల వ‌ల‌తో కోట్ల దోపిడి

విద్యార్థులకు తాయిలాలు
తల్లిదండ్రులకు ప్రలోభాలు
తమ వద్దే చదివినట్టు ప్రచారం
మాద్యమాల్లో భారీ ప్రకటనలు
మతలబులు గుర్తించిన ప్రభుత్వం
ఐదుగురు సభ్యులతో కమిటీ
ప్రకటనలకు అనుమతి తప్పనిసరి
ఇంటర్‌ ఫీజులపైనా పరిమితి
దీనిపైనా కమిటీ అజమాయిషీ…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – కార్పొరేట్‌ విద్యావ్యవస్థలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం అడ్డదార్లు తొక్కుతున్నాయి. సహజంగానే ప్రతి విద్యార్థికి ఇంటర్‌ అత్యంత కీలకం. ఇంటర్‌లో పొందిన మార్కులు, సముపార్జించిన జ్ఞానాలే విద్యార్థి భవిష్యత్‌ను నిర్దేశిస్తాయి. దీంతో తల్లిదండ్రులు కూడా పిల్లల ఇంటర్‌ విద్యపట్ల ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. దీన్నే కార్పొరేట్‌ విద్యాసంస్థలు తమకనుకూలంగా మలచుకుంటున్నాయి. గతేడాది ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసం స్థలన్నీ కలసి దేశ వ్యాప్తంగా 6.48 లక్షల కోట్ల వ్యాపారం చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవి 1.12 లక్షల కోట్ల వ్యాపారం నిర్వ#హంచా యి. ఇందులో 78 శాతం ఇంటర్‌ విద్య నుండే సమకూ రింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 29.50లక్షల మంది విద్యార్థులుంటే వారిలో 15.35 లక్షల మంది కార్పొరేట్‌ కళాశాలలు, అనుబంధ సంస్థల్లోనే చదువుతు న్నారు. తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్‌ ఇంటర్‌ వ్యాపారం ఏటా 12.5శాతం వృద్ధి నమోదు చేస్తోంది. ఈ స్థాయిలో విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని ఆకర్షించేందుకు కార్పొరేట్‌ విద్యాసంస్థలు అడ్డదార్లు తొక్కుతున్నాయి. ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన ఇతర విద్యాసంస్థల్లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్ని పలు ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. సదరు విద్యార్థి తమ కార్పొరేట్‌ కళాశాల లోనే చదివారంటూ వారి ఫోటోలు, హాల్‌టికెట్లు, పొంది న మార్కుల సంఖ్యతో సహా పెద్దెత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇంటర్‌ ఫలితాలు వెల్లడైన మర్నాడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పత్రికలన్నింటిలో ఈ కార్పొరేట్‌ కళాశాలలు పేజీల కొద్దీ రంగురంగుల ప్రకటనలు జారీ చేస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించిన అగ్రశ్రేణి విద్యార్థుల ఫోటోలు ఖచ్చితంగా దర్శనమిస్తాయి. అలాగే వంద నుంచి 95 శాతం వరకు మార్కులు సాధించిన వారందరి ఫోటోల్ని ఈ పేజీల్లో ప్రచురిస్తున్నారు. వీటితో పాటు టీవీ చానెళ్లన్నింటిలో ఈ ఫోటోలు, వారు సాధించిన మార్కుల వివరాల్తో పాటు వారంతా తమ కార్పొరేట్‌ కళాశాల విద్యార్థులేనని, తమ అధ్యాపకుల శిక్షణ వల్లే ఈ ఘనత సాధించామని చెప్పిస్తూ ప్రచారం ఊదరగొడుతున్నారు.

సదరు విద్యార్థుల్తో ప్రత్యేక ఇంటర్వ్యూలిప్పిస్తున్నారు. సహజంగానే ఇలాంటి ప్రకటనలు ఇంటర్‌ విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని ఆకర్షిస్తాయి. పైగా ఈ కార్పొరేట్‌ విద్యాసంస్థల ప్రధాన లక్ష్యం మధ్యతరగతి కుటుంబాలు. వారి పిల్లలపైనే ఇవి ఆశల వలలేస్తాయి. వార్ని సునా యాశంగా లోబర్చుకుంటాయి. తమ కళాశాలలో మాత్రమే చదివేందు కనుగుణంగా వారి మస్తిష్కాలపై ఒత్తిళ్లు తెస్తాయి. దీంతో పిల్లల పోరు పడలేక కొందరు, ఇటువంటి కళాశాలల్లో చేరిస్తే తమ పిల్లలు కూడా నూరు శాతం కాకపోయినా కనీసం 98శాతం మార్కులైనా పొందుతారని మరికొందరు వీరి వలలో పడుతున్నారు. ఈ కళాశాలల్లో తమ పిల్లల్ని చేర్పిస్తున్నారు.

ఈ ప్రకటనల వెనుక పలు రకాల మతలబులున్నాయని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రకటనలోని విద్యార్థుల్లో అత్యధికులు వారివద్ద చదివిన వారుకాదు. మారుమూల గ్రామాల్లో కొందరు ప్రైవేటు, మరికొందరు ప్రభుత్వ కళాశాలల్లో విద్యనభ్యసించిన వారు. అలాంటి విద్యార్థుల్ని తమ సంస్థలో చదివారని చెప్పించేందుకు వారి తల్లిదండ్రుల్ని పలు రకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఉచితంగా ఇంజనీరింగ్‌ సీట్లిస్తామని,విదేశాల్లో చదివిస్తామని ఆశ చూపుతున్నారు. కొందరికి భారీగా నగదు ముట్టజెప్పి లొంగదీసుకొం టున్నారు. దీనిపై ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం స్పందించింది. ఇలా ఇష్టారాజ్యంగా ప్రకటనలిచ్చి తమ రాష్ట్ర విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని మోసగిస్తున్న కార్పొరేట్‌ విద్యాసంస్థలపై కొరడా ఝళిపించింది. ఫలితాల అనంతరం ఇష్టారాజ్యంగా విద్యార్ధుల ఫోటోల్ని ఉపయోగించి ప్రకటనలు జారీ చేసే వీల్లేదని తేల్చిచెప్పింది. పైగా ఐదుగురు సభ్యుల్తో కూడిన ఓ కమిటీని నియమించింది. ఇలాంటి ప్రకటనల జారీ అంశాన్ని ఈ కమిటీ పరిశీ లిస్తుంది. ప్రకటనలో ప్రచురించే విద్యార్థులు సదరు విద్యాసంస్థలో చదివిందీ లేనిది ధ్రువీకరించుకున్న తర్వాతే ప్రకటన జారీకి అనుమతి నిస్తుంది.

- Advertisement -

దీంతో కార్పొరేట్‌ విష ప్రచార వలను తెలంగాణా ప్రభుత్వం ఛేదించే వీలేర్పడింది. అలాగే ఇంటర్‌ ఫీజులకు పరిమితిని కూడా విధించింది. గతంలో కూడా ఈ పరిమితుంది. అయితే ఇంటర్‌కు అదనంగా ఐఐటి, నీట్‌, ఎమ్‌సెట్‌వంటి పోటీ పరీక్షల కోర్సుల్ని కూడా బోధిస్తున్నందున అధిక ఫీజులు వసూలు చేస్తున్నామంటూ ఈ సంస్థలు నమ్మబలికాయి. తాజా కమిటీ ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.

ఇది తెలంగాణాకే పరిమితమైతే సరిపోదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లోనూ కార్పొరేట్‌ విద్యాసంస్థలు పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల్ని ప్రలోభాలకు గురి చేసి తమ వ్యాపార ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నాయి. ఇంటర్‌ విద్యార్థులపై ఆశల వలలు విసురుతున్నాయి. వార్నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. తెలంగాణా తరహాలోనే ఇలాంటి ప్రకటనల జారీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా నియమ నిబంధనల్తో కూడిన కమిటీని నెలకొల్పాలి. ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి చర్యలు చేపట్టాలి. అప్పుడే ఈ కార్పొరేట్‌ విద్యాసంస్థల ప్రకటనల్లోని నిబద్ధత తేలిపోతుంది. వాస్తవాలు బట్టబయలౌతాయి.విద్యార్థులు వీరి ఆశల వలలో చిక్కుకోకుండా రక్షించగలిగే వీలేర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement