దేశంలో అతి తక్కువ కరోనా వ్యాక్సినేషన్ రేటు ఉన్న రాష్ట్రం తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈరోజు నుంచి 45 ఏళ్లకు పైబడిన వారికి సుమారు 600కు పైగా కేంద్రాల్లో ప్రభుత్వం టీకాలు వేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో 45-60 ఏళ్ల వయసు గల వారు 90 లక్షల మంది నుంచి కోటి మంది ఉంటారని ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రోజుకు 50వేల మందికి టీకా వేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అయ్యాయని.. ట్రాన్స్ పోర్టు వర్కర్లు, బ్యాంకర్లు, టీచర్లతో పాటు ఇతర వర్గాల వారు కరోనా బారిన పడే అవకాశముందని.. వారికి త్వరగా వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. అటు హైదరాబాద్ నగరంలో కరోనా వ్యాక్సిన్ కోసం అర్హులైన ప్రజలు క్యూ కడుతున్నారు. ఉస్మానియా ఆస్పత్రి, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల వద్ద వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ఎగబడుతున్నారు.