కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తోంది. కరోనా పేదలు, పెద్దోళ్లు అనే తేడా లేకుండా అందరిపై తన ప్రభావం చూపుతోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా పోలీస్ శాఖను కూడా కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఎవరో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా సేవలందించిన పోలీసులు కరోనా బారిన పడుతుండటం బాధాకరమని చెప్పాలి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విధులు నిర్వహించాలంటే పోలీస్ సిబ్బంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్‌లో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 మంది పోలీసులు కరోనా బారిన పడినట్లు అధికారులు చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సేవలందిస్తున్న పలువురు పోలీసులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటం అధికారులను కలవరపెట్టిస్తోంది. హోమ్ గార్డ్ క్యాడర్ నుంచి ఐపీఎస్ క్యాడర్ వరకు అందరూ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే పోలీస్ శాఖలో 90 శాతం మంది సిబ్బంది కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..