హైదరాబాద్, ఆంధ్రప్రభ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోందని హెచ్చరించింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది.
కరోనాపై అప్రమత్తమైన కేంద్రం రేపు (సోమవారం) రాష్ట్రాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ మేరకు కేంద్ర వైద్య శాఖ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి లేఖ రాసింది. కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర హైఅలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 10, 11వ తేదీల్లో కరోనాపై కేంద్రం మాక్ డ్రిల్ కూడా నిర్వహించనుంది.
అయితే, కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, ఆందోళన కలిగించే పరిస్థితులేమీ లేవని స్పష్టం చేసింది. కరోనాతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉందని వివరించింది. ఇన్‌ఫ్లూయెంజా వ్యాధులు కూడా ఇప్పుడే ప్రబలుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పరిస్థితులను సమీక్షించి ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం చేయాలని సూచించింది.
గుంపులు గుంపులుగా ఉండొద్దు..
కరోనా మళ్ళీ ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం పలు సూచనలు చేసింది. ప్రజలు గుంపులుగా ఉండే పరిస్థితిని నియంత్రించాలని సూచించింది. ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది, రోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పేర్కొంది. కరోనా టెస్టుల సంఖ్య పెంచి, కరోనా లక్షణాలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని సూచించింది.
పడగ విప్పుతున్న కరోనా..
అదుపులోనే ఉందనుకున్న కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 1,249 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1,05,316 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,249 కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,47,00,667కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 7,927 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఇద్దరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 5,30,818కు చేరింది. ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి దేశవ్యాప్తంగా 4,41,61,922 మంది పూర్తిగా కోలుకున్నారు.
ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. కోలుకున్నవారి రేట్ 98.79 శాతం ఉండగా, మరణాల రేట్ 1.19 శాతంగా ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆరోగ్యశాఖ జారీ చేసిన గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 8,601గా ఉన్నాయి. డైలీ కోవిడ్ పాజిటివిటీ రేట్ 1.33 కాగా, వీక్లీ పాజిటివిటీ రేట్ 1.23గా ఉంది. దేశంలో ఇప్పటివరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 4,47,02,257 కాగా, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,62,832. కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 5,30,824. మరణాల శాతం 1.19. గడిచిన 24 గంటల్లో కోవిడ్‌తో ఆరుగురు మరణించారు. మహారాష్ట్రలో ముగ్గురు, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లలో ఒక్కరు చొప్పున కోవిడ్‌తో మరణించారు. యాక్టివ్ కేసుల శాతం 0.02కాగా, రికవరీ రేటు 98.97గా ఉంది.