Friday, November 22, 2024

త్వరలో 5 నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలకు కరోనా టీకా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశంలో త్వరలోనే ఐదు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు కరోనా టీకాలు ఇచ్చేందుకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోందని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించారని చెప్పారు. త్వరలో ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ కార్డు, ప్రొఫైల్‌ను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నారాయణగూడలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళాలో పాల్గొన్న కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజారోగ్యానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడు పెద్ద పీట వేస్తుందని వారి ఆరోగ్యం కోసం దేశవ్యాప్తంగా ఆరోగ్య మేళాలను నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలంతా ఈ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు పేద ప్రజలందరికీ అందేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని కోరారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆరోగ్య మేళాకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఈ మేళాలను నిర్వహిస్తోందని ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలను వినియోగించుకోకుండా ప్రైవేట్‌ ఆసుపత్రుల బాట పడుతున్నారని చెప్పారు. వారికి నాణ్యమైన ప్రభుత్వ వైద్యం అందించేలా, ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించేలా కేంద్రం ఈ మేళాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అమలు జరుగుతోందని తెలంగాణ కూడా ఈ పథకం అమలుకు ముందుకు రావాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement