కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన జూన్ రిపోర్ట్‌లో వెల్లడించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా ఆంక్షలు, చిన్న పట్టణాలు, పల్లెలకు వైరస్ పాకడంతో గ్రామీణ డిమాండ్ పడిపోయిందని ఆర్బీఐ తెలిపింది. ఇప్పుడిప్పుడే కరోనా ఆంక్షల నుంచి దేశం బయటపడుతున్నా.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇంకా కరోనా సెకండ్ వేవ్ ముప్పు పొంచే ఉన్నదని చెప్పింది. సెకండ్ వేవ్ ప్రధానంగా దేశీయ డిమాండ్‌పై పెద్ద దెబ్బే వేసిందని ఆర్బీఐ తన నివేదికలో స్పష్టం చేసింది.
దేశ ఆర్థిక వ్యవస్థ స్థితి, దిగుబడి వక్రరేఖ, దేశ ఆర్థిక చట్రంపై తన నెలవారీ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశీయ డిమాండ్ తగ్గినా.. వ్యవసాయ, స్పర్శరహిత సేవల వృద్ధి బాగానే ఉన్నదని, గతేడాది కరోనా ఆంక్షల సమయంతో పోలిస్తే ఈసారి పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుమతులు బాగానే ఉన్నాయని ఆర్బీఐ వెల్లడించింది. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత వేగంగా జరుగుతుందన్న దానిపైనే ఆర్థిక వ్యవస్థ రికవరీ ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.