దేశంలో కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ప్రాణభయంతో పరుగులు పెట్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైద్యం కోసం లక్ష రూపాయలను ఖర్చు చేస్తున్నారు. అయితే కరోనా రోగుల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది. అందినకాడికి అందినంత నిలువునా దోచుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఓ అంబులెన్స్ యజమాని రోగిని తరలించేందుకు పది వేలు, ఇరవై వేలు కాదు…ఏకంగా లక్ష రూపాయలకు పైగా బిల్లు ను వసూలు చేశారు. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 350 కిలోమీటర్ల కు లక్ష రూపాయలకు పైగా బిల్లు వసూలు చేశాడు ఆ అంబులెన్స్ డ్రైవర్.
పూర్తి వివరాల్లోకి వెళ్తే హర్యానాలోని గురుగ్రామ్ నుంచి కరోనా బాధితుడిని తీసుకుని పంజాబ్‌లోని లూధియానా వరకు వెళ్లాల్సి ఉంది. దీనికి గాను ఓ అంబులెన్స్‌ను వారు మాట్లాడుకున్నారు. డ్రైవర్ లక్షా నలభై వేలు అడిగాడు. అయితే ఆక్సిజన్ కరోనా బాధితుడి వద్ద ఉండడంతో ఓ ఇరవై వేలు తగ్గించాడు. మొత్తం 350 కిలోమీటర్ల ప్రయాణానికి గాను లక్ష ఇరవైవేలు బాధితుడు చెల్లించాడు. ఇంటికి చేరిన తర్వాత బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ బిల్లును పంకజ్ నైన్ అనే ఐపీఎస్ అధికారి ట్వీట్ చేశారు. సిగ్గుండాలి అంటూ ట్వీట్ లో పేర్కోంటూ.. ఆ బిల్లు ఫొటోను పోస్ట్ చేశారు. ఇప్పుడీ అంబులెన్స్ బిల్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.