హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కరోనా ప్రమాదకరరీతిలో వ్యాపిస్తోంది. రోజు రోజుకూ వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 795 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవలికాలంలో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండడం ఇదే తొలిసారి. తాజా కేసులను కలుపుకుంటే తెలంగాణలో ఇప్పటి వరకు నమోదై న మొత్తం కరోనా కేసుల సంఖ్య 8, 15, 679కు చేరింది. కరోనా నుంచి కోలుకోవడంతో 658 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4703కు చేరింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 36, 619మందికి కరోనా టెస్టులు చేశారు.
గ్రామీణ జిల్లాలకు వేగంగా పాకుతున్న వైరస్..
గ్రామీణ జిల్లాలకు కరోనా వేగంగా పాకుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో రోజువారీ కరోనా కేసులు రెండెంకల సంఖ్యలో నమోదవుతున్నాయి. నాలుగైదు రోజుల క్రితం వరకు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి తదితర పట్టణ జిల్లాల్లోనే ఎక్కువ కేసులు నమోదు కాగా… తాజాగా ఖమ్మం, కరీంనగర్, నల్గొండ తదితర గ్రామీణ జిల్లాల్లోనూ వైరస్ కేసులు ప్రతీ రోజూ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మంగళవారం నమోదైన కేసుల్లో 343 కేసులు ఒక్క హైదరాబాద్లోనే నమోదు కాగా… ఖమ్మం జిల్లాలో 32, కరీంనగర్ 25, మేడ్చల్ మల్కాజిగిరిలో44, రంగారెడ్డిలో 54, నల్గొండ 42, సంగారెడ్డిలో 13, అత్యధిక కేసులు నమోదయ్యాయి.