మంగోలియా నుంచి బోద్‌గయాకు వచ్చిన 23 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ అతిథి ఆర్టీపీసీఆర్ నివేదిక పాజిటివ్‌గా వచ్చిన వెంటనే.. ఢిల్లి నుంచి గయా వరకు కలకలం రేగింది. మంగోలియా పార్లమెంట్ స్పీకర్ గొంజోజవ్ జందంష్టర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కూడా కలవడమే ఇందుకు కారణం. పాజిటివ్ వచ్చిన మంగోలియా సభ్యుడిని మగద్ మెడికల్ కాలేజీలోని ఐసోలేషన్ వార్డులో చేర్చినట్టు గయా డీఎం అభిషేక్ సింగ్ తెలిపారు.
ఒమిక్రాన్ గురించి కచ్చితమైన సమాచారాన్ని పొందేందుకు వీలుగా శాంపిల్‌ను కూడా పరీక్ష కోసం బయటికి పంపిస్తామని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అతను 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటాడు. మంగోలియా పార్లమెంట్ స్పీకర్‌తో పాటు 23 మంది ప్రతినిధుల బృందం డిసెంబర్ 2న గయ చేరుకుంది. వీరంతా ఢిల్లిd మీదుగా గయా వచ్చారు. ఢిల్లిలోనూ వారికి ఘన స్వాగతం పలికారు. వారి యాంటిజెన్ ఆర్‌టీ పీసీఆర్ పరీక్ష గయా విమానాశ్రయంలో జరిగింది. కానీ వారిని క్వారంటైన్ చేయలేదు. అయితే ప్రతీ విదేశీయుడు దేశంలోకి వచ్చిన తరువాత ఆర్టీపీసీఆర్ నివేదిక వచ్చే వరకు ఐసోలేషన్‌లో ఉంచాలని భారత్ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.