దేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లి కలకలం రేపుతోంది. వాతావరణ పరిస్థితుల్లో మార్పు, చలి పెరగడం కూడా వైరస్ పెరిగేందుకు కారణమవుతోంది. కొత్త వేరియంట్ జేఎన్-1 భయాలు నెలకొన్న వేళ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 656 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో 3742 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కేరళలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 5,33,333కి చేరింది. ఇక దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కేసులు చూస్తే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు నేపథ్యంలో కొవిడ్ మరింత ఎక్కువగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రతిఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని, మాస్కు ధరించడం తప్పనిసరి చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా జేఎన్ 1 వేరియంట్ అంత ప్రమాదకారి ఏమీ కాదని, అయితే ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఈ వేరియంట్ కారణంగా ప్రాణనష్టం తక్కువగానే ఉంటుందని డబ్ల్యూహెచ్వో అంచనా వేసింది.