అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. విశాఖపట్నం, ఎన్టీఆర్ విజయవాడ, కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో గడిచిన వారం రోజులుగా 70కు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో అతికొద్ది మంది ఆసుపత్రుల్లో చేరగా మిగిలిన వారు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లి, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలతో పోలిస్తే తీవ్రత తక్కువే కాబట్టి ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. ఒక్కసారిగా కేసులు పెరిగితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేపీ పెరగడం ఫోర్త్ వేవ్‌కు సంకేతమనే అభిప్రాయాలను వైద్య వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. మొత్తం 26 జిల్లాలకుగాను ఇప్పటి వరకు నాలుగైదు జిల్లాల్లోనే మాత్రమే కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి కాబట్టి పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
స్వీయ జాగ్రత్తలు అవసరం..
గడిచిన నాలుగు నెలలుగా రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. కేసుల సంఖ్య జీరోకి వచ్చేసింది. దీంతో కరోనా ఆంక్షల్ని ప్రభుత్వం సడలించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, సినిమాహాళ్లు యథావిధిగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు అర్థరాత్రి 12 గంటల వరకు నిర్వహించుకొనేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మాస్క్ పెట్టుకోవడం, శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలకు ప్రజలు తూచ్ అనేశారు. కేవలం ఐదు నుంచి పది శాతం మంది మాత్రమే కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వీయ జాగ్రత్తలు పాటించాలని వైద్యశాఖాధికారులు సూచిస్తున్నారు. మహమ్మారి విషయంలో నిర్లక్ష్యం వద్దని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.