Tuesday, November 26, 2024

పొరుగు రాష్ట్రాల్లో రెట్టింపవుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన తెలంగాణ‌ వైద్య ఆరోగ్యశాఖ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బీఏ5, బీఏ4 వ్యాప్తి నేపథ్యంలో… రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు పెరిగే ప్రమాదం పొంచి ఉందని వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. రానున్న ఒకటి రెండు నెలల్లో మరోసారి కరోనా వైరస్‌ విస్ఫోటనాన్ని సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. పలు దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ.5 కేసులు తెలంగాణలో అక్కడక్కడా వెలుగు చూస్తుండడంతో మరో కరోనా వేవ్‌ ఒకటి రెండు నెలల్లో తప్పకపోవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, యూరప్‌లోని పలు దేశాల్లో, అమెరికాలో బీఏ5 మూలంగా రోజు వారీ కరోనా కేసులు మరోసారి పెరిగిపోయాయి. తెలంగాణకు పొరుగున ఉన్న మహరాష్ట్ర, తమిళనాడుతోపాటు దేశంలోని 23 జిల్లాల్లో కొవిడ్‌ కేసులు మళ్లి రెట్టింపవుతున్నాయి.

ఒమిక్రాన్‌ వ్యాప్తి కట్టడిలోకి వచ్చిన ఈ ఏడాది జనవరి అంటే దాదాపు మూడు నెలల తర్వాత రోజువారీ కరోనా కేసులు ప్రతీ రోజూ 50కి మించి నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో వైద్య, ఆరోగ్యశాఖ మరోసారి అప్రమత్తమైంది. మరోసారి రోజువారీ కొవిడ్‌ టెస్టులను పెంచనున్నారు. అన్ని స్థాయిల ప్రభుత్వ దవాఖానాల్లో ఉచిత వ్యాక్సిన్‌, కొవిడ్‌ టెస్టులు, మందుల పంపిణీ తదితర ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లాల డీఎంఅండ్‌హెచ్‌వోలను వైద్య, ఆరోగ్యశాఖ ఇప్పటికే ఆదేశించింది.

కొత్తగా 63 కరోనా కేసులు..

వరుసగా అయిదో రోజు తెలంగాణలో రోజువారీ కరోనా కేసులు 50కి మించి నమోదయ్యాయి. తాజాగా కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 63గా ఉంది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల వివరాలతో ఆదివారం వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక బులిటెన్‌ను విడుదల చేసింది. చికిత్స పొందుతూ మరో 47 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. శనివారం తెలంగాణ వ్యాప్తంగా 8392 కరోనా టెస్టులు చేశారు. ఇందులో 63 మందికి పాజిటివ్‌గా తేలింది. మరోవైపు కరోనా పాజిటివిటీ రేటు కూడా 0.51గా నమోదైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement