లాటిన్ అమెరికాతో పాటు కరీబియన్ దేశాల్లో కోవిడ్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య పది లక్షలు దాటింది. ఈ దేశాల్లో వైరస్ సంక్రమించిన కేసులు మూడు కోట్లు దాటినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. అయితే 90 శాతం మరణాలు కేవలం అయిదు దేశాల్లో నమోదు అయ్యాయి. బ్రెజిల్‌లో 4.46 లక్షలు, మెక్సికోలో 2.21 లక్షలు, కొలంబియాలో 83 వేలు, అర్జెంటీనాలో 73 వేలు, పెరూలో 67 వేల మంది మరణించారు. కోవిడ్ వల్ల లాటిన్ దేశాల్లో పది లక్షల మంది జీవితాలు అర్ధాంతరంగా ముగిశాయని, ఈ ప్రాంత వాసులకు ఇది విషాదకర మైలురాయి అని ప్యాన్ అమెరికా హెల్త్ ఆర్గనైజేషన్ డైరక్టర్ కారిసా ఎటిన్నా తెలిపారు.
లాటిన్ అమెరికా దేశాలపై మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిందని, మన ఆరోగ్యాలు, ఆర్థిక వ్యవస్థ, సమాజంపై దాని ప్రభావం అధికంగా ఉందని, కానీ మన జనాభాలో మూడు శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. బ్రెజిల్‌లో ఇంకా అత్యధిక స్థాయిలోనే మరణాలు సంభవిస్తున్నాయి. గత వారం సగటున రోజూ రెండు వేల మరణాలు సంభవించాయి. మెక్సికో కొంత వరకు కోలుకున్నది. బొలీవియా, ఈక్వెడార్ దేశాల్లో గత వారం మరణాల రేటు పడిపోయింది. అర్జెంటీనా, కొలంబియా దేశాల్లో మాత్రం స్వల్పంగా మరణాల సంఖ్య పెరిగింది.