Thursday, November 21, 2024

పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ మూడు రాష్ట్రాల్లో మాస్కులు తప్పనిసరి..

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మ‌ళ్లీ పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. గ‌త కొంత‌కాలంగా ఊహించ‌ని విధంగా కేసులు న‌మోద‌వుతున్నాయి. త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టే ప‌ట్టి.. మ‌ళ్లీ కోర‌లు చాచుతుండ‌డంతో ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మై బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్క్ లు ధ‌రించాల‌ని సూచిస్తున్నాయి. కరోనా నిబంధనలు పాటించాలని పలు రాష్ట్రాలు తమ ప్రజలకు సూచిస్తున్నాయి. తాజాగా మూడు రాష్ట్రాలు మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేశాయి. హర్యానా , కేరళ, పుదుచ్చేరిలో బహరింగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించాయి. కాగా, కరోనా నాలుగో వేవ్‌పై కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీచేస్తున్నది. సోమ, మంగళవారాల్లో దేశ వ్యాప్తంగా మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించ‌నుంది. తద్వారా ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో కరోనా సన్నద్ధతను పరిశీలించనున్నారు. కాగా, కోవిడ్‌ మ్యూటేషన్‌ ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ అయిన బీఎఫ్‌.7, ప్రస్తుతం ఎక్స్‌బీబీ1.16 సబ్‌ వేరియంట్‌ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ సబ్‌వేరియంట్లతో పెద్దగా ప్రమాదం లేకపోయినా కేసులు వేగంగా పెరగడానికి దోహదపడుతున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు.

హర్యానా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిబంధనలు అమలయ్యేలా చూడాలని అధికారులను, పంచాయతీలను ఆదేశించింది. అదేవిధంగా కేరళ… గర్భిణీ స్త్రీలు, వృద్ధులు మరియు జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా కేరళ మాస్క్‌లను తప్పనిసరి చేసింది. కోవిడ్ సంబంధిత మరణాలు ఎక్కువగా 60 ఏళ్లు పైబడిన వారిలో, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిలో ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించింది. అదేవిధంగా పుదుచ్చేరి ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, హాస్పిటాలిటీ, వినోద రంగాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఆదేశించింది. ఇక ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అన్ని విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ పాజిటివ్ గా తేలితే అన్ని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లీలోని కూడా కోవిడ్ కేసుల నేపథ్యంలో అప్రమత్తం అయింది. XBB.1.16 వేరియంట్ దేశరాజధానిలో కేసుల పెరుగుదలకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement