హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఫోర్త్ వేవ్ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 20 రోజులుగా రోజువారీ కరోనా కేసుల నమోదులో అనూహ్య పెరుగుదల కనిపిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో 70శాతం ఒక్క హైదరాబాద్ నగరంలోనే నమోదవుతున్నాయి. శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధిలో 366, శనివారం 341, ఆదివారం 343 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని రాజకీయ నేతలు, పోలీసు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు.
తాజాగా 434 కేసులు నమోదు..
తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 434 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,99,055కి చేరింది. కరోనా నుంచి కోలుకోవడంతో మరో 285 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. వారం, పది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నా రాష్ట్రంలో కరోనాతో మరణాలు నమోదు కాలేదు. కరోనా బారిన పడడంతో చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య 3762కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవథిలో రాష్ట్ర వ్యాప్తంగా 23, 979 మందికి కరోనా టెస్టులు చేశారు. తాజాగా నమోదైన కరోనా కేసుల్లో 343 కేసులు ఒక్క హైదరాబాద్ నగరంలోని నమోదయ్యాయి.
మేడ్చల్ మల్కాజిగిరిలో25, రంగారెడ్డిలో 34, సంగారెడ్డిలో 9 అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. పదేళ్ల లోపు చిన్నారులు బయటకు రావొద్దని వైద్యశాఖ కోరింది. పాఠశాలల్లోనూ కొవిడ్ నిబంధనలను పాటించాలని విద్యాశాఖను ఆదేశించింది. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్కూళ్ల యాజమాన్యాలకు స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.