దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. మొన్నటి తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం 13 వేల మంది కరోనా బారినపడగా, నేడు కొత్తగా 17,336 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,33,62,294కు చేరాయి. ఇందులో 4,27,49,056 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,954 మంది మృతిచెందారు. మరో 88,284 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 13 మంది మరణించగా, 13,029 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 5218 కేసులు ఉన్నాయి. కేరళలో 3890 కేసులు, ఢిల్లీలో 1934, తమిళనాడులో 1063, హర్యానాలో 872, కర్ణాటకలో 858 కేసుల చొప్పున నమోదయ్యాయి. కాగా, పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాటివిటీ 4.32 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా యాక్టివ్ కేసులు 0.20 శాతం, రికరీ రేటు 98.59 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. దేశంలో ఇప్పటివరకు 196.77 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.