Friday, November 22, 2024

Corona : కరోనా కలకలం.. ద.కొరియాలో ఒకే రోజు 4 లక్షల కేసులు నమోదు

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి మళ్లి పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గడచిన వారం రోజుల్లో కనీసం 17 శాతం కేసులు పెరుగుదల నమోదైందని వెల్లడించింది. ఆ సంస్థ హెచ్చరించినట్టే చైనా, ఐరోపా దేశాలు, అమెరికాసహా అనేక ప్రాంతాల్లో ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌ వ్యాపిస్తోంది. తాజాగా ద.కొరియాలో కరోనా కలకలం రేపింది. గడచిన రెండేళ్లలో గరిష్టంగా ఒకే రోజు 4 లక్షలకు పైగా కేసులు బుధవారం నమోదవడం విశేషం. చైనాలో కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ 3 కోట్లమందికి పైగా లాక్‌డౌన్‌లో ఉన్నారు. అయితే ద.కొరియాలో ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు నమోదైనాయి. అధికారిక గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో 4,00,741 కేసులు వెలుగుచూశాయి. అలాగే మరణాల సంఖ్య కూడా గరిష్ఠంగానే నమోదైనాయి. ఒకేరోజు 293 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసులతో కలుపుకుంటే ద.కొరియాలో మొత్తం కేసుల సంఖ్య 76,29,275కు చేరింది.

చైనాలో తగ్గని ఉధృతి..

ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ స్టెల్త్‌ వేరియంట్‌ అతివేగంగా వ్యాపిస్తోంది. చైనాలో బుధవారం కూడా కేసుల సంఖ్య పెరిగింది. గడచిన 24 గంటల్లో 3290 కొత్త కేసులు నమోదు కాగా వీరిలో 11మంది పరిస్థితి విషమంగా ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో మూడొంతులు జిలిన్‌ ప్రావిన్స్‌లోనే వెలుగుచూశాయి. రష్యా, ఉత్తర కొరియా సరిహద్దుల్లోని ఈ ప్రావిన్స్‌లో బీఏ2గా పిలిచే ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ వైరస్‌ విస్తృతి అధికంగా ఉంది. ఈ ప్రాంతంలోని షెన్‌ఝెన్‌ సహా ప్రధాన పట్టణాలు, నగరాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఇక్కడ ఒక్కచోటే 1.75 కోట్లమంది లాక్‌డౌన్‌లో ఉన్నారు.

ఒమిక్రాన్‌ తీవ్రత పెరిగింది : డబ్ల్యూహెచ్‌ఓ..

గడచిన మూడువారాలుగా తగ్గుముఖం పట్టిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పుడు మళ్లి విజృంభిస్తోందని, దాని తీవ్రత గడచిన వారం రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. డబ్ల్యూహెచ్‌ఓ కోవిడ్‌ సాంకేతిక విభాగానికి చెందిన ప్రతినిధి మరియా వాన్‌ ఖెర్కోవ్‌ ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు చైనాలో తీవ్ర స్థాయిలో కరోనా వ్యాపిస్తోందని, అలాగే జర్మనీ, అమెరికా, ద.కొరియాసహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కేసుల పెరుగుదల కన్పిస్తోందని అన్నారు. శానిటైజేషన్‌, మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిదూరం పాటించకపోవడం, ఆంక్షల సండలింపు వంటి పరిస్థితులున్న ప్రాంతాల్లో కొత్త కేసుల విజృంభణ పెరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. వ్యాక్సినేషన్‌ వల్ల మరణాలు తగ్గాయని, కానీ వైరస్‌ వ్యాప్తి తగ్గలేదని అన్నారు. కోవిడ్‌ మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయడం, వ్యాక్సినేషన్‌ వల్ల పరిస్థితులు చక్కబడతాయని, ఆ దిశగా ప్రభుత్వాలు స్పందించాలని సూచించారు.

- Advertisement -

భారత్‌ నియంత్రణలోనే…

భారత్‌లో కోవిడ్‌ ప్రస్తుతానికి నియంత్రణలోనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య స్థిరంగా ఉంటోంది. గడచిన 24 గంటల్లో 3,884 కొత్త కేసులు నమోదుకాగా 98మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 32,811 కాగా పాజిటివిటీ రేటు కేవలం 0.38 గా ఉంది. ఈ పరిస్థితుల్లో బుధవారం నుంచి 12-14 ఏళ్ల లోపు బాలబాలికలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. అలాగే 60 ఏళ్లు పైబడిన అందరికీ బూస్టర్‌ డోస్‌కు బుధవారంనుంచి ఇస్తున్నారు.

వ్యాక్సినేషన్‌లో కీలకఘట్టం – ప్రధాని మోడీ..

కోవిడ్‌-19పై పోరాటంలో భారత్‌ తనదైన ముద్రవేసిందని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మరో మైలురాయి దాటామని ప్రధాని మోడీ అన్నారు. 12-14 ఏళ్ల లోపు వారికి టీకాల కార్యక్రమం బుధవారం ప్రారంభమైన నేపథ్యంలో ఆయన స్పందించారు. దేశ ప్రజలందరికీ కోరనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఇవాళ ప్రధానమైన రోజని, దేశంలోని యువత, వృద్ధులకు టీకాలు అందుబాటులోకి తీసుకువచ్చామని, అర్హులైన ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరాటంలో భారత్‌ తనదైన ముద్రవేసిందని, 98 దేశాలకు వ్యాక్సిన్‌ మైత్రి కార్యక్రమంలో భాగంగా వ్యాక్సిన్లు పంపిణీ చేశామని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో తయారైన అనేక సంస్థల వ్యాక్సిన్లను వాడుకోగలుగుతున్నామని, ఇతర దేశాల వ్యాక్సిన్లనూ అనుమతిస్తున్నామని చెప్పారు. మార్గదర్శకాలు పాటిస్తూ కోవిడ్‌ మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కాగా ప్రపంచవ్యాప్తంగా 98 దేశాలకు 16.29 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement