Saturday, November 23, 2024

USA | తెలంగాణ‌కు క్యూ క‌డుతున్న కంపెనీలు..

అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ‌లో పెట్ట‌డుబ‌డులే ల‌క్ష్యంగా ప‌లు కంపెనీల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఈ క్రమంలో మెటీరియల్‌ సైన్స్‌ రంగంలో ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన “కార్నింగ్ ఇన్‌కార్పొరేటేడ్” కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. వివిధ కంపెనీలతో భాగస్వామిగా నూతన సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాలలో అత్యాధునిక పరిశోధన, అభివృద్ది కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో కార్నింగ్‌ భాగస్వామిగా పనిచేస్తుంది. తెలంగాణలో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పటంపై చర్చలు జరిపారు. 2025 నుంచి ఇందులో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమిస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ యూనివర్సిటీ సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లిమిటెడ్, లారస్ ఫార్మా లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ (ఎఫ్‌సిటి) హబ్‌లోనూ కార్నింగ్ కంపెనీ భాగస్వామ్యం పంచుకుంటుంది.

ఫార్మాస్యూటికల్, కెమికల్ పరిశ్రమలలో ఆవిష్కరణలతో పాటు ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీలో ఈ కంపెనీ తగిన సహకారం అందిస్తుంది. కొత్తగా అందుబాటులోకి తెస్తున్న అడ్వాన్స్‌డ్ ఫ్లో రియాక్టర్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి వివరించారు.

ఈ అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఫార్మా రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. ఔషధాల ప్యాకేజింగ్ పరిశ్రమలో ఈ గ్లాస్ ట్యూబ్‌లను ఉపయోగిస్తారు. వీటి తయారీకి వినూత్నమైన వెలాసిటీ గ్లాస్-కోటింగ్ టెక్నాలజీని ఈ కంపెనీ వినియోగిస్తోంది. ఈ కొత్త సదుపాయంతో తెలంగాణలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగంలో ఉత్పాదకత సామర్థ్యం మరింత మెరుగుపడుతుందనే అంచనాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement