దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరల కారణంగా ప్రతీ నెలా ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో నమోదవుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. రాయితీలు ప్రకటించడం ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితం పెట్రోల్, డీజెల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్, స్టీల్ తయారీకి ఉపయోగించే ముడి సరుకులపై కస్టమ్స్ సుంకం తగ్గించేందుకు ఆలోచిస్తున్నది. ఈ నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. అందనంత ఎత్తులో వెళ్లిన నూనె ధరలను కిందికి తీసుకొచ్చేందుకు నిర్ణయిస్తున్నది. సలసలమంటూ కాగుతున్న సన్‌ఫ్లవర్, సోయాబీన్ నూనె దిగుమతులపై వసూలు చేస్తున్న పన్నును తగ్గించాలని భావిస్తున్నది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. వేర్వేరు కారణాలతో భారీగా పెరిగిన వంట నూనె రేట్లను తగ్గించడానికి దిగుమతి సుంకాన్ని తగ్గించడమే మార్గమని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం
5 శాతం సెస్ ఎత్తివేత!
అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ రూపంలో అదనంగా 5 శాతం పన్ను వసూలు చేస్తున్నది. దీన్ని తగ్గించాలా..? పూర్తిగా ఎత్తేయాలా..? అన్న కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దీనిపై ఈ వారంలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పామాయిల్‌పై విధిస్తున్న సాధారణ దిగుమతి పన్ను ఇప్పటికే కేంద్రం ఎత్తేసింది. దిగుమతి లెవీని తొలగించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత.. వంట నూనెలకు భారీగా డిమాండ్ పెరిగింది. సరఫరా నిలిచిపోవడంతో.. ధరలు సుమారు 60 శాతం పెరిగాయి. నల్ల సముద్రం ద్వారానే వంట నూనెల తరలింపు ఉంటుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నాయి. రవాణా ఖర్చు పెరిగిందని కేంద్రం చెబుతున్నది. ఇండోనేషియా కూడా పామాయిల్ ఎగుమతులపై తాత్కాలికంగా నిషేధం విధించి.. ఈ వారం ప్రారంభంలో ఎత్తేసింది. దీంతో ధరలు భారీగా పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణంగ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. వంట నూనె పరంగా కొంత ఉపశమనం కల్పించాలని కేంద్రం భావిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..