అమరావతి, ఆంధ్రప్రభ : ఉక్రెయిన్, రష్యా యుద్ధ పరిణామాల నేపథ్యంల, అంతర్జాతీయంగా ప్రధాన ఉత్పత్తిదారులైన ఇండోనేషియా, మలేషియాలలో ఎగుమతులపై ఆంక్షలు విధించడం వెరసి అంతర్జాతీయంగా భగ్గుమనే వంట నూనెల ధరలు జూన్ నెలారంభం నుంచి తగ్గుముఖం పట్టాయి. పెరిగిన వంటనూనెల ధరలతో విలవిలలాడిన సామాన్య ప్రజలు ధరలు క్రమేణా తగ్గుముఖం పట్టడంతో కొంత ఊరట చెందినట్లయింది. హోల్‌సేల్ మార్కెట్లో లీటర్ వంటనూనె ధరలు రూ. 25 నుంచి రూ. 35 వరకు తగ్గాయి. జనం అధికంగా వినియోగించే పామోలిన్ ధర రూ.175 నుంచి భారీగా రూ.35 తగ్గి రూ.140కి చేరింది. ఈ నెలాఖరుకు లీటర్‌కు మరో రూ.10 తగ్గి రూ.130కి చేరే అవకాశాలు ఉన్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
వంటనూనెల ధరలను తగ్గించేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టింది. ప్రధానంగా దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించింది. అలాగే అంతర్జాతీయంగా పామోలిన్ ఉత్పత్తి చేస్తున్న ఇండోనేషియా నుంచి దిగుమతులు పెరిగాయి.
అదేవిధంగా మలేషియా నుంచి కూడా పామోలిన్ ఉత్పత్తి పెరిగింది. అంతేకాకుండా మే నెలాఖరు వరకు ఇండోనేషియా ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో అంతర్జాతీయంగా పామోలిన్ గిరాకీ ఏర్పడి ధరలు మరింత పెరిగాయి. అయితే ఆంక్షల నేపథ్యంలో ఇండోనేషియాలో నిల్వలు పెరిగి పోవడంతో ఆంక్షలు ఎత్తివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మే నెలారంభంలో ఇండోనేషియాలో టన్ను పామోలిన్ ధర రూ.6 వేల రింగిట్స్ ఉండగా ప్రస్తుతం టన్నుకు రూ.వెయ్యి రింగిట్స్ తగ్గి రూ.5 వేలకు పడిపోయింది. అదేవిధంగా కేంద్రం పామోలిన్ దిగుమతులపై సుంకం 44.5 శాతం నుంచి క్రమేణా 5 శాతంకు తగ్గించింది. ఆలాగే మిగిలిన నూనెలపై కూడా దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించింది. ఇండోనేషియాలో ఎగుమతులపై ఆంక్షలు సడలించడం, అంతర్జాతీయంగా వంటనూనెల కొనుగోళ్లు మందగించడం, కేంద్రం దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించడంతో వంటనూనెల ధరలు తిరోగమనం పట్టాయి.
ఈ నెలాఖరుకు మరింతగా తగ్గవచ్చని వ్యాపార వర్గాలు చెబుతున్నారు. పామోలిన్‌తో పాటు సన్‌ఫ్లవర్, సోయాబిన్, రైస్‌బ్రాన్, వేరుశనగనూనె, ఆవనూనె, కుసుమనూనె, కాటన్ సీడ్ నూనెల ధరలు గతంలో లీటర్ రూ.200 పైన ధర పలకడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇవన్నీ రూ.200కు దిగువన లీటర్‌కు రూ.170 నుంచి రూ.180 వరకు తగ్గాయి. వంటనూనెల ధరలు ఆకాశాన్నంటిన సమయంలో ప్రభుత్వం వ్యాపారులు, నిల్వదారులపై విస్తృతంగా దాడులు నిర్వహించింది. ధరలను అదుపులోకి పెట్టేందుకు రైతు బజార్ల ద్వారా తక్కువ ధరలకు విక్రయించడం జరిగింది. ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పట్టడంతో అధికారుల దాడులు కూడా తగ్గాయి. ఇదిలా ఉంటే హోల్‌సేల్ మార్కెట్లో ధరలు భారీగా తగ్గినా రిటైల్ మార్కెట్లో ఆ మేర విక్రయాలు జరగడం లేదు. నెలాఖరుకు రిటైల్ మార్కెట్లో కూడా తగ్గిన ధరల ప్రభావం చూపనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.