Saturday, November 23, 2024

వంటగ్యాస్‌ సిలిండర్ ధర రూ.50 పెంపు!..

చమురు సంస్థలు ధరల మోతకు తెరతీశాయి. సామాన్యుడి బడ్జెట్‌ను తలకిందుల చేసేలా ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన అనంతరం ధరలను పెంచడం మొదలెట్టాయి. మంగళవారం నుంచి పెట్రోల్‌, డీజిల్‌తో బాదుడు మొదలుపెట్టిన చమురు సంస్థలు వంటగ్యాస్‌ సిలిండర్‌పై రూ.50 పెంచాయి. 14.2కేజీల డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరపై రూ.50 అదనంగా పెంచాయి. దీంతో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర వెయ్యిరూపాయలు దాటింది. కొత్తధరతో తెలంగాణలో సిలిండర్‌ రూ.1002కు చేరుకోగా, ఏపీలో 1008కు చేరింది. పెరిగిన ధర మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. మరోవైపు 137రోజుల విరామం తర్వాత పెట్రోధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్‌పై 91పైసలు, డీజిల్‌పై 88పైసలు పెంచాయి. మార్చి 22 ఉదయం 6నుంచి ఈ ధరలు అమలులోకి వచ్చాయని గ్యాస్‌డీలర్లు వెల్లడించారు.

కాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. అయితే కొన్ని నెలలకు ముందు చమురు ధరలు గరిష్టస్థాయికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.5 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి పలు రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్రం పెట్రోధరలపై వ్యూహాత్మక వైఖరితో పెంచలేదు. కానీ రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కారణంగా చమురు సంస్థలు మళ్లి పెట్రోమోతను ఆరంభించాయి. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.109.10, డీజిల్‌ 95.49కు చేరింది. కాగా దేశరాజధాని ఢిల్లిdలో ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.899 నుంచి రూ.949కు పెరిగింది. కోల్‌కతాలో రూ.926 నుంచి రూ.976కు పెరిగింది. కాగా అక్టోబర్‌ 2021 తర్వాత సిలిండర్‌ ధర రూ.50 పెరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement