న్యూఢిల్లీ – మోడీ ఇంటిపేరు వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 21న విచారణ చేపట్టనుంది. ఈ కేసులో తనకు మెజిస్ట్రేట్ కోర్టు విధించిన దోషి, రెండేళ్ల జైలు శిక్షపై స్టే ఇవ్వడానికి గుజరాత్ హైకోర్టు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌కు సంబంధించి అత్యవసర జాబితాను కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు రాహుల్ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మంగళవారం ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘‘శుక్రవారం లేదా సోమవారం తేదీని కోరుతున్నాను’’ అని అభిషేక్ మను సింఘ్వీ చెప్పారు. అయితే ఈ పిటిషన్‌ను శుక్రవారం జాబితా చేయండి అని జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశించారు.