మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసు దోషిని ఖైదీలు జైలులో హత్య చేశారు. ఐరన్ పైప్‌తో అతడి తలపై కొట్టి చంపారు..
కొల్హాపూర్‌లోని కలాంబా సెంట్రల్ జైలులో ఈ సంఘటన జరిగింది. 1993 మార్చి 12న ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 257 మంది మరణించగా వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఈ కేసులో దోషి అయిన 59 ఏళ్ల మున్నా అలియాస్ మహ్మద్ అలీ ఖాన్ అలియాస్ మనోజ్ కుమార్ భవర్లాల్ గుప్తా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.
.కాగా, ఆదివారం జైలులోని బాత్రూమ్ ప్రాంతంలో స్నానం చేయడంపై మహ్మద్ అలీ ఖాన్, ఇతర ఖైదీల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కొంత మంది ఖైదీలు డ్రైనేజీకి చెందిన ఇనుప పైప్‌తో అతడి తలపై కొట్టారని జైలు అధికారులు తెలిపారు. తల పగిలి తీవ్రంగా గాయపడిన ఖాన్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారన్నారు
.
మరోవైపు జైలులో దాడి చేసి మహ్మద్ అలీ ఖాన్‌ను హత్య చేసిన నిందితులను ప్రతీక్ అలియాస్ పిల్యా సురేష్ పాటిల్, దీపక్ నేతాజీ ఖోట్, సందీప్ శంకర్ చవాన్, రీతురాజ్ వినాయక్ ఇనామ్దార్, సౌరభ్ వికాస్‌లుగా గుర్తించినట్లు కొల్హాపూర్ పోలీసులు తెలిపారు. ఈ ఐదుగురిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.