పులివెందుల: సిల్వర్ చైన్ వివాదంలో అన్న చెల్లెల్ని హత్య చేసిన ఘటన పులివెందులలో చోటుచేసుకుంది. తొలుత ఆత్మహత్యగా భావించారు. వెండి గొలుసు కోసం చెల్లెలును అన్న హత్య చేశారని పోలీసులు దర్యాప్తులో బయటపడింది. పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రం సహస్త్ర జిల్లా సుగ్రవాల్ గ్రామానికి చెందిన బసంత్‌పాశ్వన్, కిరణ్‌దేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం.
ఏడాది కిందట పులివెందులకు వచ్చి ఎన్‌ఎస్‌ఎల్ టెక్స్ టైల్స్ కంపెనీలో ఆ దంపతులు కూలీలుగా పనిచేస్తూ, అక్కడే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో బసంత్‌పాశ్వన్ 3 నెలల కిందట తన పెద్దకొడుకు రాజీవ్ పాశ్వన్ కోసం వెండి గొలుసును ఇచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో పెద్దలకు తెలియకుండా కుమార్తె మిలాన్‌కుమారి(14) వెండిగొలుసు తీసుకుని మెడలో వేసుకుంది. దీంతో రాజీవ్ పాశ్వన్ తనకు తెచ్చిన గొలుసును నీవెందుకు వేసుకున్నావని చెల్లెలుపై అరవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆ బాలిక మెడలో నుంచి వెండి గొలుసును బలవంతంగా లాక్కొనే క్రమంలో గొంతుకు గట్టిగా బిగించాడు. దీంతో ఊపిరాడక మిలాన్‌కుమారి కిందపడిపోయింది. చికిత్స కోసం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై హుస్సేన్ తెలిపారు.