సినిమా షూటింగ్ ల బంద్ నిర్ణయం సరికాదని సీనియర్ నటుడు సుమన్ అన్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ కలిసి తీసుకున్న నిర్ణయం మీద తన అసహనాన్ని ప్రదర్శించారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్, ఫిల్మ్ ఛాంబర్ కలిసి షూటింగ్‌లు బంద్ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ 1 నుంచి షూటింగ్‌లు జరగబోవని ప్రకటించారు. అన్ని సమస్యల మీద పరిష్కరించుకున్నాకే షూటింగ్‌లు మొదలవుతాయని, అది ఎప్పుడనేది త్వరలోనే చెబుతామన్నారు. బంద్‌తో ఓటీటీలకు వాటిల్లే నష్టం ఏమీ లేదన్నారు. మంచి కంటెంట్ లతో సినిమా వస్తే థియేర్లలోనూ ఆదరిస్తున్నారన్నారు. ఓటీటీ సినిమాల సెన్సార్‌పై దృష్టి సారించాలని సుమన్ సూచించారు.
హీరోల రెమ్యూనరేషన్ పై వివాదం అనవసరమని నొక్కివక్కానించారు. రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలనడం సబబు కాదని అన్నారు.. ఇండస్ట్రీలో మా ఫ్యామిలీస్ అని చెప్పుకు తిరిగేవారు వాళ్ల హీరోలను తగ్గించకోమని అడగాలని హీరో సుమన్ చురకలు అంటించారు. హీరోలకు ఉన్న ఆదరణ బట్టి రెమ్యూనరేషన్ ఇస్తుంటారని అన్నారు. షూటింగ్‌ల సమయాన్ని ప్రొడ్యూసర్లు పెంచుకోవాలి అని పేర్కొన్నారు. అవసరం మేరకే కాల్షీట్లు తీసుకోవాలని సూచించారు. బయ్యర్లకు నష్టం లేకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు. తమళినాడులో తన సినిమాలకు వరుసగా నష్టాలు వస్తే రజనీకాంత్ రెన్యూమరేషన్ తిరిగి ఇచ్చేసారని, అలాంటి ఉదారత ఇక్కడ ఉంటే మంచిదని సుమన్ హితవు పలికారు.