గుంటూరు ఈస్ట్ పారిస్ చర్చిలో కొంతకాలంగా ఫాస్టర్ల మధ్య ఆధిప్యత పోరు నడుస్తోంది. సోమవారం ఈ వర్గపోరు ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకుంది. ప్రార్థనల సమయంలో ఈ చర్చికి తనను ఫాదర్‌గా నియమించారంటూ రవికిరణ్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో జేసుదానం, రవికిరణ్ వర్గాల మధ్య వివాదం మొదలైంది. దీంతో ఇరువర్గాల మధ్య పరస్పరం దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఘర్షణలో జాన్ కృపాకర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. ఆయన్ను గుంటూరులోని జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన్ను మంగళవారం నాడు ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతంరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చర్చిలో దాడులు జరగడం బాధాకరమన్నారు. కొన్ని అరాచక శక్తులు అక్రమాలకు పాల్పడుతూ దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. బిషప్లందరితో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశానని, ఈ ఉద్దేశంతోనే తాను చర్చి ఫాదర్‌ను పరామర్శించడానికి వచ్చానని తెలిపారు. అయితే ఈ వివాదంలో రాజకీయ పార్టీల జోక్యం ఉందో, లేదో తెలియదని గౌతంరెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ వార్త కూడా చదవండి: వైఎస్ వివేకా కేసులో కొత్త ట్విస్ట్