న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాబోయే రెండేళ్లలో టీబీ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. టీబీ నిర్ధారణకు ల్యాబ్‌లు, మెడిసిన్‌ను అందుబాటులో ఉంచామని వైఎస్సార్సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి అడిగిన ప్రశ్నలకు కేంద్రం బదులిచ్చింది. 2025 నాటికి దేశంలో టీబీని నివారించాలని జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక (2017–2025)ను కేంద్రం అభివృద్ధి చేసిందని, ఇందులో భాగంగా ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌ను 2022 సెప్టెంబర్ 9న ప్రారంభించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. దేశంలోని అన్ని జిల్లాలను కవర్ చేసే మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ లభ్యతను 4,761 యంత్రాలకు పెంచినట్లు తెలిపారు.
టీబీ నిర్ధారణ కోసం దేశంలో పలు టెస్టింగ్ లేబొరేటరీలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే దేశవ్యాప్తంగా 162 నోడల్ డ్రగ్ రెసిస్టెంట్ కేంద్రాలు, 614 జిల్లాల డ్రగ్ రెసిస్టివ్ కేంద్రాల ద్వారా చికిత్సా సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. డీఆర్‌టీబీ నియంత్రణలో ఉంచేందుకు కొత్త మందులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని కేంద్రమంత్రి వివరించారు. అలాగే రోగ నిర్ధారణ అయిన టీబీ రోగికి చికిత్స ప్రారంభించే ముందు పరీక్షలు చేయడానికి అధునాతన టెస్టింగ్ పద్దతులను అవలంభిస్తున్నామని జవాబులో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 28 శాతం టీబీ రోగులు ఉన్నట్లు వెల్లడించారు.