చిరుద్యోగుల జీవితాల్లో.. తెలంగాణ ప్రభుత్వం చిరు దీపాలు వెలిగించింది. అట్ట డుగున ఉన్న వేతనాలను.. ఆత్మీయస్పర్శతో రెట్టింపుచేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వంలో వివిధ సంస్థలకు పని చేస్తున్న చిరు ఉద్యోగులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదుకుంటూ వస్తోంది. ఆత్మీయతతో అక్కున చేర్చుకుంది. ముఖ్యమంత్రి నివాసా నికే పిలిచి.. సమావేశాలు నిర్వహించి.. వరాలు ప్రకటించి, సహపంక్తి భోజనాలు చేసి ఆ కుటుంబాలకు ధైర్యంగా సీఎం కేసీఆర్ నిలిచారు. ఒకప్పుడు ఎపుడొస్తాయో తెలి యని జీతాలను కూడా నెలనెలా పక్కాగా వచ్చేలా.. ప్రత్యేక ఆదేశాలిచ్చారు. మాన వీయకోణంలో.. చిరుద్యోగులకు కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచారు…
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఉద్యమకాలంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సకలజనులతో కలిసి వచ్చి తమ ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి ఉద్యమంలో ముందువరుసలో నిలిచిన తెలంగాణ ప్రాంతానికి చెందిన చిరు ఉద్యోగులను టీఆర్‌ఎస్ సర్కార్ ఆదినుండీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. ఉద్యమకాలంలో ప్రభుత్వంలోని ఉద్యోగులతో పాటు ఆయా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిన కేసీఆర్.. ముఖ్యమంత్రి హోదాలో ఉద్యోగుల విషయంలో కుటుంబ పెద్దగా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకొని అనేక కీలక విభాగాల జీతాలను రెట్టింపు చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రగతి భవన్ లో వివిధ విభాగాల వారీగా ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సాధకబాధకాలను తెలుసుకొని పరిష్కరించారు. అంగన్వాడీలను ప్రగతి భవన్‌కి ఆహ్వానించి వారితో కలిసి భోజనం చేసి వారి జీతాల పెంపుని ప్రకటించారు. దీంతోపాటు ఆశా వర్కర్ల జీతం ఐదు రెట్లు పెంచారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాలను వారు అడగకముందే రెట్టింపు చేసి సలాం సఫాయన్న అని అన్నారు. గ్రామపంచాయతీలో కేవలం వెయ్యి, పదిహేను వందల రూపాయలకు పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు నెలకి కచ్చితంగా 8500 ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అతి తక్కువ జీతాలకు విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు పార్ట్ టైమ్ లెక్చరర్లు, రెసిడెన్షియల్ స్కూల్ లో ఉపాధ్యాయుల జీతాలు భారీగా పెంచారు. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వంలో అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను కూడా దాదాపుగా రెట్టింపు చేశారు.
ఠంచనుగా జీతాలు దేశంలో ఎక్కడా లేని విధంగా హూంగార్డులకు జీతాన్ని భారీగా పెంచారు. ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేకంగా కాలుష్య అలవెన్సులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో పూజలు చేస్తున్న అర్చకులకు ప్రత్యేకంగా జీతాన్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. 2014 కి ముందు ఉన్న జీతాలతో పోలిస్తే రాష్ట్రంలో పనిచేస్తున్న చిరు ఉద్యోగుల జీతాలు ప్రస్తుతం రెట్టింపు అయ్యాయి. కేవలం జీతాలు మాత్రమే పెంచి వదిలేయకుండా వారికి ఠంచన్ గా నెలవారి జీతాలు అందించేలా ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో గతానికి భిన్నంగా నెలలవారీగా జీతాలు పెండింగ్‌లో ఉండకుండా చిరు ఉద్యోగులకు జీతాలు నెలకోసారి చేతికి అందుతున్నాయి.
రాష్ట్రంలో తక్కువ వేతనంతో పని చేస్తున్నవారి వేతనాల సవరణ తీరు..
ఉద్యోగులు పాత జీతం ప్రస్తుత జీతం
హోంగార్డులు రూ,9వేలు రూ.23,250
ఐకేపీ ఫీల్డ్ అసిస్టెంట్లు 6,260 12వేలు
వీఆర్‌ఏ 6,500 10,500
వీవోఏ 1500 5వేలు
కాంట్రాక్టు రెసి టీచర్స్ – 10,900
రెసి స్కూల్ అసిస్టెంట్స్ – 14,800
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 6,700 12వేలు 8,400 15వేలు 10,900 17వేలు
కాంట్రాక్టు లెక్చరర్లు 18వేలు 37,100
పార్ట్ టైమ్ లెక్చరర్లు – 21వేలు
అటెండర్స్ 3,900 7,800
నరేగా ఉద్యోగులు 6,290 10వేలు
అంగన్‌వాడీ కార్యకర్తలు 4,200 10,500
అంగన్‌వాడీ హెల్పర్లు 2,200 6వేలు
జీహెచ్‌ఎంసీ 8,500 17,500
పారిశుధ్య కార్మికులు
జీహెచ్‌ఎంసీ డ్రైవర్లు 10,200 17,500
ఆశా వర్కర్లు 1000-1500 6వేలు
అర్చకులు 8వేలు (గ్రామాల్లో) 10వేలు (పట్టణాల్లో)
హెచ్‌ఎం/వార్డెన్‌కు 5వేలు 21వేలు
సీఆర్‌టీలకు 4వేలు 15వేలు
పీఈఐటీలకు 4వేలు 11వేలు
అకౌంటెంట్ 3500 10వేలు
ఎఎన్‌ఎంలకు 4వేలు 9వేలు
కుక్స్, ఆయాలు, హెల్పర్స్ 2500 7500
స్వీపర్స్, వాచ్‌మెన్‌లకు పంచాయితీ వర్కర్లు, సఫాయి కర్మాచారిలు రూ.1-5వేలు రూ.8,500