Wednesday, November 20, 2024

కృష్ణమ్మ పరుగులు.. శ్రీశైల జలాశయం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

కర్నూలు, ప్రభన్యూస్‌ బ్యూరో : శ్రీశైల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది డ్యాం నిండుకుండను తలపిస్తోంది. దీంతో ఎగువ నుంచి వచ్చిన వరద నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం జలాశయం 882 అడుగులుగా ఉండగా, జలాశయానికి చెందిన ఒక గేటును పది అడుగుల మేర పైకి ఎత్తి దిగువన సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం డ్యాంకు ఎగువ జూరాల నుంచి 31,213 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది . ఇక సుంకేసుల బ్యారేజ్‌ నుంచి 16544 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది . సాయంత్రం అందిన సమాచారం మేరకు శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులకు గాను, ప్రస్తుత నీటి మట్టం 882.10 అడుగులుగా ఉంది. ఇక జలాశయంలో 215 టిఎంసిల నీటి నిల్వలకు గాను, 199.7354 టిఎంసిలు నిల్వ ఉన్నాయి. ఇక జలాశయానికి 47757 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉండగా, జలాశయానికి చెందిన ఓ స్పిల్‌వే గేటు ద్వారా 26744 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.

దీంతో విడుదలైన నీరు పరవళ్లు తొక్కుతూ దిగువన సాగర్‌కు వెెడుతోంది. ఇదే సమయంలో డ్యాం నుంచి ఏపి వపర్‌హౌజ్‌కు 27150 క్యూసెక్కులు, తెలంగాణకు చెందిన ఎడమ విద్యుత్‌ కేంద్రం నుంచి 31784 క్యూసెక్కులు, కల్వకుర్తి కి 800, మల్యాల నుంచి హంద్రీనివాకు 1013, పోతిరెడ్డిపాడుకు 17 వేల క్యూసెక్కుల చొప్పున డ్యాం నుంచి మొత్తం 1,04,521 క్యూసెక్కులు విడువలవుతోంది. ఇదే సమయంలో శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తిని గ్రిడ్‌కు అందిస్తూ గడిచిన 24 గంటల్లో 12.313 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లుగా సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement