అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోఎండల తీవ్రత కొనసాగుతోంది. బుధవారం కర్నూలు జిల్లా మంత్రాలయంలో 43.4, ప్రకాశం జిల్లా మర్రిపూడిలో 43.1, ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో 43 అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 6 మండలాల్లో వడగాల్పులు వీచాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం అనకాపల్లి జిల్లా అనకాపల్లి, బుచ్చయ్యపేట, చోడవరం, కె.కోటపాడు, కశింకోట, కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం,నాతవరం, సబ్బవరం మండలాలు, కాకినాడ జిల్లా కోటనందూరు, తుని మండలాలు, విజయనగరం జిల్లా జామి, కొత్తవలస మండలాలు, విశాఖలోని పద్మనాభం మండలంలో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని.
శుక్రవారం 302 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు- విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. శుక్ర, శనివారం రెండురోజులపాటు- ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వడగాల్పులు, అకాల వర్షాలు, పిడుగుపాటు- పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల క్రింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.