న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపంచ బ్యాంకు అందజేస్తున్న సహాయాన్ని కొనసాగించాలని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆ బ్యాంకు ప్రతినిధులను కోరారు. సోమవారం ప్రపంచబ్యాంకు కంట్రీ డైరెక్టర్ అగస్తే కువామే నేతృత్వంలోని అధికారుల బృందం కిషన్ రెడ్డితో సమావేశమైంది. ఈ సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి వరల్డ్ బ్యాంకు ద్వారా జరుగుతున్న సహాయ కార్యక్రమాలను అభినందించిన కిషన్ రెడ్డి, ఇకపైనా ఈ సహాయాన్ని కొనసాగించాలన్నారు. ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న సమగ్రాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఈశాన్య రాష్ట్రాల పురోగతి కోసం కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొల్పడంతోపాటు, అనుసంధానతకోసం జరుగుతున్న కృషిని ఈ సందర్భంగా ఆయన వివరించారు. వరల్డ్ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ అగస్తే కువామే మాట్లాడుతూ.. కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో సానుకూల మార్పులు క్షేత్రస్థాయిలో కనబడుతున్నాయన్నారు. అనుసంధానత విషయంలో ప్రత్యేకంగా తీసుకుంటున్న చర్యల కారణంగా అన్ని వర్గాల వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతోందన్నారు. ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో ప్రపంచబ్యాంకు సహకారం ఇకపైనా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.