Tuesday, November 26, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమల, ప్రభన్యూస్‌: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లన్నీ నిండి కిలోమీటర్‌ మేర భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. టోకెన్‌ రహిత సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంటే స్లాటెట్‌ సర్వ, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. రెండవ శనివారంతో పాటు వరుస సెలవుల నేప థ్యంలో కోనేటి రాయుడి దర్శనార్ధం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాలతో పాటు రోడ్డుమార్గం గుండా భారీగా భక్తులు తిరుమలకు తరలివస్తుండడంతో తిరుమలలో ఎటుచూసిన భక్తులతో కిక్కిరిసిన క్యూలైన్‌లే దర్శనమిస్తున్నాయి. శ్రీనివాసుడి దర్శనం కోసం భారీగా భక్తులు క్యూ లైన్‌లలో బారులు తీరారు.

- Advertisement -

స్వామివారి దర్శనంకోసం భక్తులు వేచివుండే వైకుంఠం క్యూ కాంప్లెక్సు-1, 2 లోని కంపార్టుమెంట్లన్నీ పూర్తిగా నిండి క్యూ లైన్‌లు వెలుపలికి వచ్చాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లు కూడా భక్తులతో నిండిపోవడంతో ఏటిసి, నారాయణగిరి అతిథిగృహం మార్గం గుండా శిలాతోరణం రోడ్డు వరకు క్యూ లైన్‌ వ్యాపించింది. సుమారు కిలోమీటర్‌ మేర భక్తులు క్యూ లైన్‌లో వేచివున్నారు. ఇక కాలినడకన భక్తులు ప్రవాహంలా తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం కాలినడకన వచ్చే భక్తులకు అలిపిరి మార్గంలో 10 వేలు, శ్రీవారిమెట్టుమార్గంలో 5 వేలు దివ్యదర్శనం టోకెన్లను టిటిడి జారి చేస్తుండగా ఈ టోకెన్లు ఇప్పటికే పూర్తవడంతో అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలలో కాలినడకన వచ్చే భక్తులంతా కూడా సర్వదర్శనం క్యూ లైన్‌గుండానే స్వామివారిని దర్శించుకోవాల్సి ఉండడంతో సర్వదర్శనం క్యూ లైన్‌ మరింత పెరుగుతోంది.

అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగి నేపథ్యంలో స్వామివారిని సర్వదర్శనం గుండా దర్శించుకోవాలంటే దాదాపు 24 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తులు దర్శనం కోసం వేచివుండే సమయం భారీగా పెరగడంతో క్యూ లైన్‌లో వేచివుండే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్‌లో వేచివున్న భక్తులకు టిటిడి సిబ్బంది నిరంతరాయంగా త్రాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తుండడంతో భక్తులకు కాస్త ఉపశమనం లభిస్తోంది.

భక్తుల రద్దీ భారీగా పెరగడంతో క్యూలైన్‌లో వేచివున్న భక్తులకు త్వరిత గతిన దర్శనం కల్పించేలా టిటిడి ఏర్పాట్లు చేస్తోంది. దీంతో శనివారం 86,781 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక గదులు కేటాయించే కౌంటర్ల వద్ద కూడా భక్తులు భారీగా బారులు తీరారు. అయితే గదులు ఖాళీలు ఏర్పడక పోవడంతో టిటిడి భక్తులకు గదులు కేటాయించలేక పోతుంది. దీంతో గదులు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మరికొందరు టిటిడి ఏర్పాటు చేసిన లాకర్లు పొంది సేద తీరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement