Saturday, November 23, 2024

పెట్రో బాదుడు ఇంకెన్నాళ్లు….

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – దేశంలోని ఏడు రాష్ట్రాల్లో పెట్రోలియం ఉత్పత్తుల వినిమయ ధరలో 50శాతం కంటే అధికంగా పన్నుల రూపంలో ప్రభు త్వాలు తమ ఖజానాలో జమ చేసుకుంటు న్నాయి. పెట్రోలియం ఉత్పత్తులపై మహ రాష్ట్ర 52.5శాతం పన్నులు వసూలు చేస్తోంది. ఏపీ 52.4శాతం పన్నులు విధి స్తోంది. తెలంగాణ 51.6శాతం, రాజస్థాన్‌ 50.8శాతం, మధ్యప్రదేశ్‌ 50.6శాతం, కేరళ 50.2శాతం, బీహార్‌ 50శాతం పన్ను లు వసూలు చేస్తున్నాయి. దేశంలోని 19కి పైగా రాష్ట్రాలు పెట్రోలియం గరిష్ట విక్రయ ధరలో 40శాతానికి పైగా పన్నుల రూపంలో ఆదాయం పొందుతున్నాయి. దేశంలో ఒకే తరహా పన్ను విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పెట్రోలియం ఉత్పత్తుల్ని కూడా జీఎస్‌టీపరిధిలోకి తేవాలంటూ వినియోగదార్లు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రం ఇందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. జీఎస్‌టీ కౌన్సిల్‌లో దీనిపై పలు సందర్భాల్లో చర్చ జరిగింది. కానీ రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను అంగీకరించడం లేదు. పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను వసూలు చేసుకునే అధికారాన్ని రాష్ట్రాల పరిధిలోని వాల్యూయాడెడ్‌ టాక్స్‌ క్రింద మాత్రమే కొనసాగించాలని రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి.

ప్రస్తుతం జీఎస్‌టీ విధానంలో కేంద్రం గరిష్టంగా 28శాతం స్లాబ్‌ను వసూలు చేస్తోంది. పెట్రోలియం ఉత్పత్తుల్ని జీఎస్‌టీ పరిధిలోకి తెస్తే వాటిపై ఈ స్లాబ్‌ అమలయ్యే అవకాశాలుంటాయి. దీంతో పెట్రోలియం ఉత్పత్తులపై రాష్ట్రాలకు గరిష్టంగా 14శాతం మాత్రమే పన్నుల రూపంలో సమకూరుతుంది. ఈ కారణంగానే రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాయి. రాష్ట్రాలు పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాలపై పన్నులను అతిపెద్ద ఆదాయ వనరుగా పరిగణిస్తున్నాయి. సుమారు రూ.2 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ అమలు చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు ఏటా రూ.35 వేల నుంచి 40 వేల కోట్ల వరకు సమకూరుతున్నాయి. అలాగే ఇతర రాష్ట్రాల బడ్జెట్‌లోనూ 20శాతం వరకు పెట్రోలియం పన్నుల ఆదాయం ఉంటోంది. పెరుగుతున్న సంక్షేమ పథకాల వ్యయానికనుగుణంగా ఎప్పటికప్పుడు పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల్ని రాష్ట్రాలు సవరిస్తున్నాయి. పెరుగుతున్న వ్యయానికి అనుగుణంగా పెట్రోలియం ఉత్పత్తుల నుంచి ఆదాయాన్ని రాబడుతున్నాయి.

ఆదినుంచి పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల శాతం దేశంలో వివాదాస్పదంగానే ఉంటోంది. ఈ విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఎన్ని చర్చలు జరిగినా అవి ఫలవంతం కావడంలేదు. వాస్తవానికి జీఎస్‌టీ స్లాబ్‌ల శాతం అధికంగా ఉండడంతో పెట్రోలియం ఉత్పత్తుల్ని ఏకరూప పన్ను విధానం నుంచి కేంద్రం మినహాయించింది. రాష్ట్రాలకే పన్ను నిర్ణయించుకునే అవకాశమిస్తే తక్కువ శాతం పన్నులు విధిస్తాయని భావించింది. తద్వారా పెట్రోల్‌ ధరలు అదుపులో ఉంటాయని ఆశించింది. అలాగే పెట్రోలి విక్రయాల్లో రాష్ట్రాల మధ్య పోటీతత్వం పెరిగి ధరల నియంత్రణకు రాష్ట్రాల ఆసక్తి కనబరుస్తాయని భావించినప్పటికీ వాస్తవ పరిస్థితులందుకు విరుద్ధంగా మారాయి. పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల శాతాన్ని ఏటేటా రాష్ట్రాలు పెంచుతున్నాయి. ఇది కేవలం పెట్రోలియం వినియోగదార్లపైనే కాదు.. మొత్తం మార్కెట్‌ వ్యవస్థపైనే ప్రభావం చూపిస్తోంది. ఉత్పత్తయిన ప్రాంతం నుంచి వినిమయ ప్రాంతాల వరకు రవాణా వ్యయం అనూహ్యంగా పెరిగింది. ఇది వస్తువుల గరిష్ట చిల్లర ధర పెంపునకు దారితీస్తోంది. సహజంగానే ఇది వినియోగదార్లకు భారంగా పరిణమించింది. చిల్లర ధరల సగటు సూచి రోజురోజుకు పైకి ఎదగడానికి దారితీస్తోంది. అలాగే కుటుంబాల్లో ద్రవ్యోల్బనం పెరుగుదలకు కారణమౌతోంది. ఓ వైపు సాగులో యాంత్రీకరణకు కేంద్రం పెట్టపీటేస్తోంది. యంత్రాల కొనుగోలుకు ఆర్థిక ప్రోత్సాహకాలిస్తోంది. భారీగా రాయితీలు, సబ్సిడీలు కూడా అందిస్తోంది.

- Advertisement -


అయితే ఈ యంత్రాలన్నీ డీజెల్‌ లేదా పెట్రోల్‌ ఆధారంగా పని చేసేవే. కొనుగోలుకు సబ్సిడీలు అందినా వీటి నిర్వహణా వ్యయం తడిచి మోపెడవుతోంది. వాస్తవానికి కూలీలతో చేయంచే పని వ్యయంతో పోలిస్తే యంత్రాల ద్వారా నిర్వహణా వ్యయం తగ్గుతుందని వేసిన అంచనాలు తలక్రిందులౌతున్నాయి. అంతకంటే యంత్రాల ద్వారానే ఖర్చు పెరిగింది. ఈ భారాన్ని వ్యవసాయోత్పత్తుల గరిష్ట చిల్లరధరల్లో కలపక తప్పడం లేదు. సహజంగానే ఇది వినియోగదార్లకు ఆర్థికభారంగా పరిణమిస్తోంది. వీటన్నింటికి పరిష్కారం ఒకటే.. కుటుంబాల నుంచి సమాజస్థాయిలో ద్రవ్యోల్బణం అదుపు, వినిమయ ధరల నియంత్రణకు పెట్రోల్‌, డీజెల్‌, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాలపై పన్నుల నిర్ణాయక హక్కును కేంద్రానికి అప్పగించడం. జీఎస్‌టీ పరిధిలోకి ఈ ఉత్పత్తుల్ని తేవడం. దేశవ్యాప్తంగా ఒకే తరహా పన్ను విధానాన్ని అమలు చేయడం. తద్వారా రవాణా చార్జీలు తగ్గుతాయి. వినిమయ మార్కెట్ల పై భారం తగ్గుముఖం పడుతుంది. సరుకుల ధరలు అందుబాటులోకొస్తాయి. సహజంగానే ఇది కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఈ సారి జీఎస్‌టీ కౌన్సిల్‌ ఈ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని వినియోగదార్లు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement