అమరావతి, ఆంధ్రప్రభ : విద్యుత్ రంగానికి ఉజ్వల భవిష్యత్తును కల్పించేలా వినియోగదారులకు, భవిష్యత్ తరాలకు తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్ సరఫరాయే లక్ష్యంగా విద్యుత్ రంగంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రజల సంక్షేమం మరియు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమైన ఇంధన భద్రతను సాధించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న విద్యుత్ రంగానికి ప్రథమ ప్రాధాన్యత కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరాతోపాటు వినియోగదారులకు 24/7 నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందుబాటులో ఉంచడంపై ప్రభుత్వ ప్రధానంగా దృష్టిసారిస్తోంది.
రాష్ట్ర ఆర్థిక సామర్థ్యం రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న నేపథ్యం ఒకవైపు, అన్ని కీలక రంగాలలో వేగవంతమైన పారిశ్రామికీకరణ, అభివృద్ధి నమోదవండం మరోవైపు ప్రభుత్వాన్ని ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టిని పెట్టేలా చేస్తున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రాబోయే సంవత్సరాల్లో అనేక రెట్లు పెరగనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్ర వృద్ధి విద్యుత్ రంగంతో ముడిపడి ఉన్నందున వార్షిక ఇంధన వినియోగం 2017-18లో 50077 ఎంయూతో పోలిస్తే 2022-23లో 65830 ఎంయూకు చేరుకుంది. అంటే ఇప్పటికే దాదాపు 31.45 శాతానికి పెరిగింది. అలాగే, విద్యుత్ సంస్థలు ఇటీవల రోజుకు 251 ఎంయూ ఆల్ టైమ్ హై ఎనర్జీ డిమాండ్‌ను విజయవంతంగా తీర్చాయి.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని
రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు విద్యుత్ వృద్ధి కీలకం. ప్రాథమిక సామాజిక అవసరాలను నెరవేర్చడానికి, ఆర్థిక వ్యవస్థను ఆశించినంత వేగంగా నడపడానికి మరియు మానవ అభివృద్ధికి విద్యుత్ అందించడానికి ఇంధన సేవలు ప్రాథమికమైనవి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు అంతరాయం కలగకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. భవిష్యత్ ఇంధన డిమాండ్‌ను తీర్చడంలో భాగంగా, రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి స్థాపన సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఇది విద్యుత్‌ను చౌకగా తయారుచేసేందుకు ఉపయోగపడుతుందని స్పష్టంచేస్తోంది. ఇది రాష్ట్రంలోని వినియోగదారులకు తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్‌ను అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. విద్యుత్ సంస్థల యొక్క ఆలోచన, చర్య లేదా ఏదైనా పని కేవలం ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరియు ముఖ్యంగా దీర్ఘకాలంలో విద్యుత్ రంగంలో ప్రజా ప్రయోజనాలను పరిరక్షించడానికి మాత్రమే ఉద్దేశించబడినవని పేర్కొంటోంది.
విండ్, సోలార్, హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తిపై ఫోకస్
ఇంధన రంగాన్ని బలోపేతం చేయడానికి విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించడానికి ప్రభుత్వం ఇప్పటికే పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020ని ప్రకటించిందని ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే విజయానంద్ తెలిపారు. అంతేకాకుండా, దాదాపు 33 గిగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్ట్‌లు (పీఎస్‌పీ) నది మరియు నది వెలుపల రెండు ప్రాంతాలలో నిర్మాణానికి ప్లాన్ చేయడం జరిగిందన్నారు. ఈప్రాజెక్టులు పూర్తయితే విద్యుత్ రంగంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్‌గా నిలిచి మిగులు విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయగలదని తెలిపారు.
ఈరంగానికి వినియోగదారులే ఎల్లవేళలా బాస్ అని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వినియోగదారులకు నమ్మకమైన విద్యుత్‌ను అందించాలని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించాలని ఆకాంక్షిస్తున్నారని ఆయన అన్నారు. వ్యవసాయానికి 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ను వచ్చే 25 ఏళ్ల పాటు- కొనసాగించేందుకు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని గుర్తుచేశారు.
రోజుకు 105 మిలియన్ యూనిట్ల సరఫరా
జెన్‌కో రాష్ట్ర గ్రిడ్‌కు రోజుకు 102 నుండి 105 మిలియన్ యూనిట్లను సరఫరా చేస్తోందని, ఇది మొత్తం ఇంధన డిమాండ్‌లో 40 నుండి 45 శాతం ఉందని ఏపీ జెన్‌కో ఎండీ కేవీఎన్ చక్రధర బాబు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఇది అత్యధికమన్నారు. ఏపీ జెన్‌కో బొగ్గు నిల్వలను మెరుగుపరచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందన్న ఆయన తక్కువ ఖర్చుతో కూడిన సమర్థవంతమైన విద్యుత్ ఉత్పత్తిని తయారుచేస్తోందన్నారు. ఏపీ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తిలో మరియు అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) నిర్వహణలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థగా నిలవడానికి కృషి చేస్తుందని ఆయన చెప్పారు. థర్మల్ పవర్ జనరేటింగ్ యూనిట్లను మరింత బలోపేతం చేసేందుకు ఆర్థిక మరియు కార్యాచరణ పనితీరును మెరుగుపరిచేందుకు జెన్‌కో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోందని తెలియజేశారు.