న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలో రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రైల్వే శాఖ మిగిలిన అన్ని శాఖలతో వేగవంతంగా సంప్రదింపులు జరుపుతోందని ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి బీజేపీ రాజ్యసభ సభ్యులు డా.లక్ష్మణ్ అడిగిన ప్రశ్నలకు సోమవారం ఆయన జవాబులిచ్చారు. రైల్వే ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రాష్ట్రాల నుంచి భూసేకరణ జరగాలని, అందుకు అటవీశాఖ నుంచి క్లియరెన్సులు రావడం, రాష్ట్రాల వాటాధనం వెంటనే జమ కావడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించడం, స్థానిక శాంతి భద్రతల పరిస్థితులు, ఇలా అనేక అంశాలు ఉంటాయని కేంద్రమంత్రి చెప్పారు. వీటన్నిటి కోసం రైల్వే శాఖలో గతిశక్తి డైరెక్టరేట్ నియామకంతో పాటు ప్రయారిటీ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రాలు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో మాట్లాడటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే ప్రాజెక్టులు జోనల్, డివిజన్ వారీగా మంజూరవుతాయన్న ఆయన, వాటిలో కొన్నిసార్లు రాష్ట్రాల సరిహద్దులు కూడా మారుతుంటాయని స్పష్టం చేశారు.
మనోరాబాద్ – కొత్తపల్లి, భద్రాచలం -కొవ్వూరు, అక్కన్నపేట – మెదక్, భద్రాచలం – సత్తుపల్లి, హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఫేస్ 2 వంటి ఈ ఐదు ప్రాజెక్టులకుగాను రూ.7,350 కోట్లు అంచనా వేయగా, రూ.2,588 కోట్లు ఇప్పటికే ప్రాజెక్టుల మీద ఖర్చు చేసినట్టు ఆయన తెలిపారు. రూ.1,279 కోట్లు తెలంగాణ ప్రభుత్వం తన వాటా కింద జమ చేసిందని, ఇంకా రూ.986 కోట్లు తెలంగాణ ప్రభుత్వం తన వాటా కింద జమ చేయాల్సి ఉందని వెల్లడించారు. రైల్వే ప్రాజెక్టుల కోసం తెలంగాణలో 2095 హెక్లార్ట రెవెన్యూ భూమి, 56 హెక్టార్ల ఫారెస్ట్ భూమి అవసరమవగా ఇప్పటివరకు తెలంగాణ సర్కారు 1918 హెక్టార్ల రెవెన్యూ భూమిని, 41 హెక్టార్ల ఫారెస్ట్ భూమిని సేకరించిందని, ఇంకా 41 హెక్టార్ల రెవెన్యూ భూమి, 15 హెక్టార్ల అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉందని చెప్పారు.
రైల్వే బడ్జెట్ లో భాగంగా మౌలిక వసతులు కల్పన, రక్షణ పనుల కోసం తెలంగాణ రైల్వేకు 2014-19 వరకు రూ.1,110 కోట్లు కేటాయింపులు జరగ్గా… 2019-20 కి గాను రూ.2,056 కోట్లు, 2020-21కి గాను రూ.2,602 కోట్లు, 2021-22కు రూ.2,486 కోట్లు, 2022-23కు రూ.3,048 కోట్లు, 2023-24కుగాను రైల్వే శాఖ రూ.4,418 కోట్లు కేటాయించినట్టు అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. హైదారాబాద్ ఎంఎంటీఎస్ ఫేజ్ 2పై ఎన్ని సార్లు లేఖలు రాసినా తెలంగాణ సర్కార్ స్పందించట్లేదని ఆయన జవాబులో పేర్కొన్నారు. ఇందుకోసం రూ.816.55 కోట్లు అంచనా వేయగా. ఈ ఖర్చు రైల్వే, తెలంగాణ ప్రభుత్వం 1:2 నిష్పత్తిలో భరించాల్సి ఉందని చెప్పారు. ఇందులో రూ. 544.36 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాటా ధనంలో కేవలం 279.02 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు తెలంగాణ సర్కార్ విడుదల చేసిందని, మిగిలిన రూ. 265.34 కోట్ల కోసం రైల్వే శాఖ అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా పెడచెవిన పెట్టారని అన్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్ 2 కోసం కోసం రైల్వే శాఖ తన వాటా ధనం కన్నా అధికంగా కేటాయించిందని ఆయన వెల్లడించారు.