న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), అందుకు అనుగుణంగా దేశ రాజధానిలో తన పార్టీ కార్యాలయాన్ని సిద్ధం చేసుకుంటోంది. వసంత్ విహార్‌లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రధాన భవంతి పనులు ఇప్పటికే పూర్తవగా ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. అవి కూడా తుది దశకు చేరుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
కార్యాలయ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం నిర్మాణ పనులను పరిశీలించారు. పార్టీ జాతీయాధ్యక్షులు కే. చంద్రశేఖర రావు ఆలోచనల ప్రకారం పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులు జరిగేలా నిర్మాణ సంస్థకు పలు సూచనలు జారీ చేశారు. ఆ మేరకు తుదిమెరుగులు దిద్దాలని ఆదేశించారు. అలాగే కార్యాలయ ఫర్నిచర్‌ను కూడా ఆయన పరిశీలించారు. కేసీఆర్ నిర్ణయించిన గడువు లోగా పార్టీ కార్యాలయం నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని నిర్మాణ సంస్థకు ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం జరిపిన సమీక్షలో మంత్రి వెంట ఆర్కిటెక్ట్ ఆస్కార్ వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు కూడా ఉన్నారు.