Wednesday, November 20, 2024

రోడ్ల నిర్మాణాన్ని స్పీడ‌ప్ చేయాలి, తక్షణమే పూర్తి కావాలి.. ఆదేశించిన సీఎం జ‌గ‌న్‌

అమరావతి , ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రోడ్ల మరమ్మతులు, నిర్మాణాల పనుల్లో వేగం పెంచాలని, తక్షణమే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పనుల ప్రగతిపై రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పురపట్టణాభివృద్ధి శాఖ అధికారులతో ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ నాడు – నేడు కింద చేపట్టిన పనుల్లో మంచి పురోగతి కనిపిస్తుందని, రహదారుల మరమ్మతుల పనులు చురుగ్గా సాగుతున్నాయని స్పష్టం చేశారు.

పనులు ప్రారంభమై, అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జీలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్‌లను పూర్తిచేసేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వీటికి సంబంధించిన పనులు ఎక్కడా పెండింగ్‌లో ఉండకూడదని ప్రాధాన్యతాక్రమంలో పూర్తికావాలని నిర్దేశించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో పనుల ఫలితాలు కచ్ఛితంగా కనిపించాలని, రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుం డా తీర్చిదిద్దాలని ఆదేశాలు జారీ చేశారు. నివర్‌ తుఫాన్‌ కారణంగా కొట్టుకుపోయిన బ్రిడ్జీల స్థానంలో కొత్త నిర్మాణాలను చేపట్టాలని ఇవన్నీ ప్రాధాన్యతాక్రమంలో చేపట్టాలని సూచించారు.

అలాగే తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే నిర్మించాలని స్పష్టం చేశారు. రహదారులు, భవనాల శాఖ పరిధిలో ప్రత్యేక వర్క్‌ల కింద చేపట్టిన 1168 పనులకు రూ. 2 వేల 205 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని వెల్లడించారు. మొత్తం 7 వేల 804 కిలో మీటర్ల మేర పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికే వీటిలో 675 పనులు పూర్తయ్యాయని, మరో 491 పనులు 62 శాతం మేర పూర్తయినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి వరకు రూ. 1369 కోట్ల మేర పనులు జరిగినట్లు తెలిపారు. మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. నాబార్డ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌ (నిడా -1) కింద చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయని మొత్తం 233 పనులకు రూ. 2 వేల 479.61 కోట్ల నిధులు ఖర్చు అవుతాయని వివరించారు.

వీటిలో రూ. 1321 కోట్ల మేర నిధులను ఖర్చు చేయడం జరిగిందని పేర్కొన్నారు. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. పంచాయతీరాజ్‌ పరిధిలోని రోడ్ల మరమ్మతులు, నిర్మాణం కూడా చేపట్టామని 1843 రోడ్ల మరమ్మతుల నిర్మాణం కోసం రూ. 1072. 92 కోట్లు వెచ్చిస్తున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 4635 కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతుల నిర్మాణం చేపట్టామని చెప్పారు. అధికారుల వివరణ అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాధాన్యతాక్రమంలో పనులు జరగాలని స్పష్టం చేశారు. అలాగే కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీల్లో రహదారుల మరమ్మతులు చేపట్టాలని నిర్దేశించారు.

- Advertisement -

రానున్న జూన్‌ 15 నాటికి అన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో రహదారుల మరమ్మతులు పూర్తిచేసి 20వ తేదీ నాటికి ఫోటో గ్యాలరీలు పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు సాగనీయకుండా రకరకాల కుట్రలు పన్నుతున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్రానికి రుణాలు ఇవ్వకూడదని కేంద్రం నుంచి నిధులు రాకుండా కేసుల ద్వారా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ఒక అజెండాతో పనిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా పట్టువీడని సంకల్పంతో ముందుకు సాగుతున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న అన్ని రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా నిధుల లోటు అన్న మాటే రాకూడదని, చెల్లింపుల సమస్య లేకుండా చూసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

ప్రజలకు మంచిచేసే కార్యక్రమాలను ప్ర భుత్వం చేపట్టిందని వీటన్నింటినీ పూర్తిచేసే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మంత్రులు, బూడి ముత్యాలనాయుడు, ఆదిమూలపు సురేష్‌, దాడిశెట్టి రాజా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, మునిసిపల్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై. శ్రీలక్ష్మీ, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీ సత్యానారాయణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement