- పక్కగా ఉండాలన్న సీఎం రేవంత్
- గోషామహల్‌లో ఉస్మానియా ఆస్పత్రికి ఈ నెల 31న సీఎం శంకుస్థాపన
రానున్న వందేళ్ల అవసరాలకు అనుగుణంగా ఉస్మానియా ఆసుపత్రిని పూర్తి ఆధునిక సౌకర్యాలతో నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొత్త ఆసుపత్రి భవనాల నిర్మాణానికి సంబంధించి ఏ విషయంలోనూ రాజీపడవద్దని అధికారులకు సూచించారు. గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఈనెల 31న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో ఆస్పత్రి నిర్మాణాన్ని సమీక్షించి పలు సూచనలు చేశారు. ఉస్మానియా ఆస్పత్రి భవనంతో పాటు బోధనా సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ భవనాల నిర్మాణంలో పూర్తి నిబంధనలు పాటించాలన్నారు.
ఆసుపత్రి భవన నిర్మాణాలు, పార్కింగ్, ల్యాండ్‌స్కేప్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రికి రాకపోకలు సాగించేందుకు అన్ని వైపులా రోడ్లు ఉండాలని.. అవసరమైన చోట అండర్‌పాస్‌లు నిర్మించి ఇతర రహదారులను అనుసంధానం చేయాలని సూచించారు.
ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకులు, సందర్శకుల వాహనాలకు రెండు అంతస్తుల భూగర్భ పార్కింగ్ ఉండాలాగ డిజైన్ చేయాలని సూచించారు. వసతి గృహం, అగ్నిమాపక కేంద్రం, క్యాంటీన్, యూరినల్స్, ఎస్‌టీపీలు నిర్మించాలన్నారు
కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడిన పిల్లలు రావడానికి రెండు మూడు రోజులు పడుతుందని… అప్పటి వరకు మృత దేహాలను భద్రపరిచేందుకు ఆధునిక సౌకర్యాలతో కూడిన మార్చురీ, బాడీ ఫ్రీజింగ్ సదుపాయాలు నిర్మించాలని సీఎం రేవంత్ అన్నారు.
అవయవాల మార్పిడి.. అత్యవసర సమయాల్లో రోగుల తరలింపునకు వీలుగా హెలీ అంబులెన్స్‌లు వినియోగిస్తున్నందున హెలీప్యాడ్ నిర్మాణం కూడా చేపట్టాలన్నారు. ఆసుపత్రిలో అడుగుపెట్టగానే ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలని.. ఆసుపత్రి భవన నిర్మాణాలకు సంబంధించిన నమూనాల్లో పలు మార్పులు చేర్పులను ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.