Friday, November 22, 2024

యుద్ధప్రాతిపదికన కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం.. చీఫ్‌ ఇంజనీర్ల కమిటీని ఆదేశించిన మంత్రుల బృందం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కొత్తగా ఏర్పాటు చేస్తున్న 8 మెడికల్‌ కాలేజీల ఏర్పాటు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుపై సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో వైద్య, ఆరోగ్యశాఖ, ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని, ఈ క్రమంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ తనిఖీలు త్వరలో ఉన్నాయని, ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం అన్ని కొత్త కాలేజీల్లో ఏర్పాట్లు పూర్తి కావాలన్నారు. ప్రతి రోజూ పనుల పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల మద్దతు ఉంటుందన్నారు. పనులు పూర్తయిన తర్వాత వెంటనే కావాల్సిన వైద్య పరికరాలను కాలేజీల్లో నెలకొల్పాలన్నారు. ఈ సమీక్షలో ఆర్‌అండ్‌బీ ఈఇన్‌సీ గణపతిరెడ్డి, డీఎంఈ డా. రమేష్‌రెడ్డి, ఆయా కళాశాలల సూపరిండెంట్లు, ప్రిన్సిపాళ్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణంపై నియమించిన చీఫ్‌ ఇంజనీర్ల కమిటీ తన రిపోర్టును త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రులు హరీష్‌రావు, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం సోమవారం ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో మంత్రుల బృందం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీతో కలిసి చీఫ్‌ ఇంజనీర్ల కమిటీతో భేటీ అయ్యారు. హైకోర్టు సూచనలు, కమిటీ రిపోర్టు ప్రకారం హెరిటేజ్‌ బిల్డింగ్‌కి ఇబ్బంది కలుగకుండా కొత్త నిర్మాణాలు చేపట్టడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిటీకి మంత్రుల బృందం పలు సూచనలు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement